Take a fresh look at your lifestyle.

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు

ముద్ర, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది.  కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు ఆధ్వర్యంలో గత ఏడాది బడిచౌడి, మల్లంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, క్రీడా దుస్తులు, షూలను పంపిణీ చేశారు. అంతేకాకుండా పదో తరగతి బోర్డు పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థికి రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సవాల్‌ను విద్యార్థులు విజయవంతంగా స్వీకరించి అద్భుత ఫలితాలు సాధించారు. ఐదు పాఠశాలల్లో కలిపి ఉత్తీర్ణత శాతం 83 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది. ఎస్‌ఎస్‌సీ-2026 పరీక్షల్లో మొత్తం 42 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు.

పాఠశాలల వారీగా చూస్తే మల్లంపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 10 మంది, బాచుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 7 మంది, నిజాంపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 12 మంది, ప్రగతి నగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 10 మంది, బడిచౌడిలోని జీహెచ్‌ఎస్ నయాబజార్‌లో 3 మంది విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

హామీ మేరకు 42 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.21 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నారు. వచ్చే నెలలో నిర్వహించే ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ఈ నగదు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు కృషికి తగిన గుర్తింపు లభిస్తే అసాధారణ ఫలితాలు సాధించవచ్చని మరోసారి నిరూపితమైందని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.