ముద్ర, హైదరాబాద్: యాంటీబయాటిక్స్‌ను అవసరానికి మించి, వైద్యుల సూచనలు లేకుండా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్ కేర్ హాస్పిటల్స్ 100 రోజుల యాంటీబయాటిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి నవంబర్ 14 వరకు తెలంగాణతో పాటు తెలుగు ప్రజల్లో యాంటీబయాటిక్స్ వినియోగంపై అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఏ.ఎం. రెడ్డి మాట్లాడుతూ.. యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే సూక్ష్మజీవులు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. దీనివల్ల గట్ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు రోగనిరోధక శక్తి బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తాత్కాలిక అనారోగ్యాలకు కూడా అవసరానికి మించి మందులు తీసుకోవడం వల్ల సమస్యలు పునరావృతమయ్యే అవకాశం ఉందని, మందుల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాంటీబయాటిక్స్‌ను స్వయంగా తీసుకోకుండా వైద్యుల సలహాతోనే వినియోగించాలని ఆయన కోరారు. భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
డాక్టర్ కేర్ క్యాన్సర్ కేర్ డైరెక్టర్ డాక్టర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ.. అవసరం లేకుండా ఎక్కువ మొత్తంలో మందులు వినియోగించడం ద్వారా శరీరంపై అనవసరమైన ఔషధ భారం పడుతోందన్నారు. తాను పరిశీలిస్తున్న పలు క్యాన్సర్ కేసుల్లో గట్‌కు సంబంధించిన సమస్యలు కూడా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్‌కు యాంటీబయాటిక్స్‌నే ప్రత్యక్ష కారణంగా నిర్ధారించడానికి మరింత శాస్త్రీయ ఆధారాలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్ కేర్ స్కిన్ డైరెక్టర్ డాక్టర్ అమరావతి మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో యాంటీబయాటిక్స్ సులభంగా లభించడం వల్ల కొందరు వైద్యుల సూచనలు లేకుండానే వాటిని వినియోగిస్తున్నారని తెలిపారు. యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సలహాతోనే తీసుకోవాలని, వైద్యులు కూడా అవసరాన్ని అంచనా వేసిన తర్వాత మాత్రమే వాటిని సూచించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకేష్, డాక్టర్ పాటిల్, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ శ్వేత, డాక్టర్ అఖిలతో పాటు డాక్టర్ కేర్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి మీడియా కో-ఆర్డినేటర్లు సహకరించారు.
ప్రజల్లో యాంటీబయాటిక్స్‌పై అవగాహన పెంచడం, స్వీయ మందుల వినియోగాన్ని తగ్గించడం, వైద్యుల సూచనల మేరకే యాంటీబయాటిక్స్ ఉపయోగించేలా ప్రోత్సహించడం ఈ 100 రోజుల కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డాక్టర్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సాగర్ సింహం తెలిపారు.