Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రతినిధులారా…. మీరు ఆదర్శంగా నిలవండి

మీ ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి
కోటి ఇండ్లల్లో సోలార్ వ్యవస్థ ఏర్పాటే మోదీ సర్కార్ లక్ష్యం
సోలార్ ప్యానెల్ పై సబ్సిడీతోపాటు 80 శాతం లోన్ వస్తుంది
పేదలకు సైతం భారం లేకుండా సోలార్ ను ఏర్పాటు చేసుకునే వీలుంది
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు


ప్రజాప్రతినిధులంతా తమ ఇండ్లపై సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వార్డు సభ్యులు నుంచి సర్పంచ్‌లు, కౌన్సిలర్లు నుంచి కార్పొరేటర్ల వరకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “PM సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన” పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ పథకానికి కేంద్రం రూ.75 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు. ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని చెప్పారు.

మోదీ పిలుపు మేరకు కరీంనగర్‌లోని తన నివాసంపై సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. టీజీరెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్లతో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించి, పథకం అవగాహన కరపత్రాలను విడుదల చేశారు.

సోలార్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. తన ఇంటిలో నెలకు రూ.25-30 వేల వరకు వచ్చే విద్యుత్ బిల్లు, సోలార్ వల్ల రూ.5 వేలలోపే వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే, సోలార్ ఏర్పాటుకు రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, 80 శాతం వరకు రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉందని వివరించారు.

ప్రజలు విద్యుత్ కొనుగోలు చేసే స్థాయి నుంచి అమ్మే స్థాయికి చేరుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రైతులు, సాధారణ ప్రజలు సోలార్ ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించి ఆదాయం పొందవచ్చన్నారు.

ఇక వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు PM-KUSUM పథకం అమలు జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యమని వెల్లడించారు. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు ముందుకు వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

అయితే, రాష్ట్రంలో ఈ పథకాలపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటివరకు కరీంనగర్‌లో 46, సిరిసిల్లలో 17 దరఖాస్తులు మాత్రమే రావడం ఆందోళనకరమన్నారు. ఎక్కువ మంది రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.