ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వైద్యులు సమాజంలో ఒక భాగమని, ప్రజల సేవకి వైద్యులు తోడ్పడతారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్మల్ శాఖ పేర్కొంది. వారిపై దాడుల వల్ల అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందకుండా పోతాయని అన్నారు.

ఈ మేరకు నిర్మల్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ బాధ్యులు మాట్లాడుతూ గురువారం సాయంత్రం డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటనలో ప్రజలంతా కలిసికట్టుగా సంఘీభావం ప్రకటించి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం బిల్లు అధికంగా వేసి ఇవ్వాలన్న విషయం తిరస్కరించినందుకే దాడి చేశారని పేర్కొన్నారు. బిల్లులు అధికంగా వేసి ఇవ్వటం ప్రభుత్వాన్ని మోసం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. కాగా నిర్మల్ లో జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ఐఎంఏ శాఖ కూడా స్పందించిందన్నారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారన్నారు. ఎస్పీ ఇచ్చిన హమీ మేరకు తాము నిరసనలు విరమించామని, పోలీసు యంత్రాంగం కూడా తగిన చర్యలు చేపట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రింబవళ్ళు ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా చట్టాలున్నాయన్నారు. యాక్ట్ 11, 2008 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు తో పాటు మూడేళ్ల జైలు శిక్ష, ఆస్తుల నష్టం కలిగిస్తే పరిహారం అందించేలా ఆ చట్టంలో నిబంధనలున్నాయన్నారు. నిర్మల్ ఘటనలో బాధ్యులపై త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. చర్యలను అనుసరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో సంఘ బాధ్యులు డాక్టర్లు మురళీధర్, ప్రమోద్ చంద్రారెడ్డి, దేవేందర్ రెడ్డి, రామకృష్ణ, సంతోష్ రాజ్, రంజిత, కృష్ణంరాజు ఉన్నారు.