- హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం.
- అయినా సరే తమ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శులు చేస్తున్నాయి.
- దశలవారీగా అర్హులందరికీ ఇళ్ళు.
- ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడులు.
- మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశంలో ఏడాది వ్యవధిలోనే 57వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ లో “నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల” నూతన భవనాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు..రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తుందన్నారు.ఈ ప్రక్రియలో నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను కరిక్యులంలో భాగం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పదోన్నతులను కల్పించామన్నారు.పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అమ్మ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలనే పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.పదేళ్లుగా పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్ ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.తమది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, నాట్కో సంస్థ ప్రతినిధులు లక్ష్మినారాయణ, పీఎస్ఆర్ కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
