Take a fresh look at your lifestyle.

ఆ నివేదికను చూసి సిగ్గుపడాలి

  • రూ.లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం కుప్పకూలింది.
  • మెడిగడ్డ,అన్నారం,సిందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి.
  • అయినా బీఆర్​ ఎస్​ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
  • రాష్ట్ర రైతాంగానికి ఆ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
  • ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు.
  • మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బీఆర్​ఎస్​ పార్టీ నేతలు సిగ్గు పడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్ద్వజమెత్తారు.బీఆర్​ఎస్​ పాలనలో నిర్మించిన ఈ ప్రాజెక్టు వారి పాలనలోనే కుప్ప కూలిపోయిందని ఎద్దేవా చేశారు. మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లు ఎందుకూ పనికి రాకుండా పోయాయని చెప్పారు. అయినా ఆ నిర్మాణాలు తమ గొప్పతనమని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవోటల్ లో ప్రారంభమైన భారత్​ సమ్మిట్​ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధిక వడ్డీలతో రూ.లక్ష కోట్లు రుణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు.ఇంత జరిగాక కుడా ఆ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్​ఎస్​ సొంత జాగీర్ కాదన్నారు.ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఎన్డీఎస్​ఏ ఇచ్చిన నివేదిక పై సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలకై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.బీఆర్​ఎస్​ పాలనలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు రైతుల కోసం నిర్మించింది ఎంత మాత్రం కాదన్న మంత్రి..నాటి అధికార పార్టీ నేతలు జేబులు నింపు కోవడానికే దీనిని వినియోగించుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించి అందుకు బాద్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి హెచ్చరించారు. ఈ అంశంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదన్నారు.బాద్యులైన వారికి శిక్షలు తప్పవని ఆయన పేర్కొన్నారు.ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన రూపకల్పన,నిర్వహణ లోపాలు బయట పడిన నేపథ్యంలో బీఆర్​ ఎస్​ నేతలు రాష్ట్ర రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారెజ్ లు నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో దాన్యం దిగుబడి రికార్డు సృష్టింసుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం విషయంలో అనుసరించిన విధానాలు మాత్రమె దోహద పడ్డాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.