ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ పాత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కే. రవికుమార్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా వ్యాధిని పూర్తిగా అంతం చేయవచ్చని తెలిపారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా నిరోధించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2007 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ “మలేరియాను అంతం చేయాలనే తపన – ఇప్పుడు మనము చేయగలం” అని వెల్లడించారు.
ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మలేరియా నిర్ధారణ కోసం ఆర్.డి.టి కిట్లు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
దోమల పెరుగుదలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని సూచించారు. నీటి తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకులను ఖాళీ చేసి శుభ్రపరచి కొంతసేపు ఆరబెట్టిన తరువాత మాత్రమే నీరు నింపుకోవాలని చెప్పారు.
అలాగే ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు మెష్‌లు ఏర్పాటు చేసుకోవడం, దోమతెరలు వినియోగించడం ద్వారా రక్షణ పొందవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ రాజశేఖర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ సృజన, ఎంఎల్హెచ్పీలు, పర్యవేక్షణ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.