Take a fresh look at your lifestyle.

జలవికాసం పథకం పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

  • ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా గిరిజన రైతులకు ఆర్థిక స్వావలంబన.
  • ఇందిర సౌరగిరి జల వికాస పథకం పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు.
  • గిరిజన రైతులకు సౌర నీటిపారుదలతో సుస్థిర సాగు.
  • నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

 ముద్ర విలేఖరి,అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్‌ మండలం, మాచారం గ్రామం లో ఇందిర సౌరగిరి జల వికాసం పథకానికి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ కింద భూమి హక్కులు కలిగి ఉన్న గిరిజన రైతుల ఆర్థిక మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇందిర సౌరగిరి జల వికాస పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం, అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మే 18 న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వివరించారు.ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా రాష్ట్రంలోని 2.10 లక్షల మంది గిరిజన రైతుల భూములకు విద్యుత్‌, సాగునీటి సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. మాచారం గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టు ద్వారా ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు కలిగి ఉన్న 27 మంది గిరిజన రైతుల 50 ఎకరాలకు సౌరశక్తితో కూడిన నీటిపారుదల అందించడానికి 16 బోర్లను వేసి స్ప్రింక్లర్ల ద్వారా నీటినందించేందుకు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గిరిజన రైతుల ఆర్థిక మరియు జీవన ప్రమాణాలను పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం ద్వారా అందించిన గిరిజనుల భూముల్లో పళ్ళతోటల పెంపకం, అంతర్గత పంటలు, ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా గిరిజనులు తమ భూములను సాగు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని గిరిజనులో గణనీయమైన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.ఇందిర సౌరగిరి జల వికాస పథకంలో సౌరశక్తితో నడిచే నీటిపారుదల సౌకర్యం మాత్రమే కాకుండా, బిందు సేద్యం ద్వారా ఉద్యానవన పంటలకు మద్దతుతో నిమ్మ మొక్కలు, బత్తాయి మొక్కలు, మామిడి మొక్కలు, అవకాడ మొక్కలు, కొబ్బరి మొక్కలు, వెదురు మొక్కలను నాటి శాశ్వత దిగుబడి ప్రారంభమయ్యే వరకు ఇతర పంటల ద్వారా మధ్యంతర ఆదాయ మద్దతు కూడా అందించేందుకు ఈ పథకం ద్వారా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలైన అవకాడో, వెదురు, దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ అంజీర్ వంటి పంటలు గిరిజనులు సాగు చేసేందుకు కార్యచరణ రూపొందించుకొని ఉద్యాన శాఖ అధికారులు గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, మన్ననూర్‌ ఐటీడీఏ పీవో రోహిత్‌ గోపిడి, డీటీడీవో ఫిరంగి, డీపీవో మోహన్‌రావు, జిల్లా ఉద్యానవన అధికారులు జగన్‌, లక్ష్మణ్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.