Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో కుస్తీ… గల్లీలో దోస్తీ

కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర కలయిక తేలిపోయింది
బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకు సిద్ధాంతాలు గాలికొదిలేశాయి
అధికార పీఠం కోసం దిగజారి మద్దతు ఇచ్చుకున్నాయి
మాజీ మంత్రి హరీశ్ రావు

ముద్ర, హైదరాబాద్ :

ఢిల్లీలో కొట్టుకున్నట్టు నటిస్తోన్న కాంగ్రెస్, బీజేపీలు గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకొని పదవులు పంచుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దీనికి ఆలియాబాద్, మెదక్, నర్సాపూర్, అమన్‌గల్ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. కాంగ్రెస్ మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని అధికార పార్టీని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయని ధ్వజమెత్తారు. సోమవారం మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికలపై స్పందించిన హరీశ్ రావు ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఒకటేనని ఈ మున్సిపల్ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చెప్పారు. రాష్ట్రంలో జెండాలు అజెండాలను పక్కనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారుతారో ఆయా పార్టీలు ఈ ఎన్నికల్లో నిరూపించాయని విమర్శించారు. గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్‍కు బీ-టీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలన్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని నిరూపించాయన్నారు. బీజేపీతో కలిసి సింగిల్ టీమ్‍గా మారిపోయిందని. ఈ అపవిత్ర కలయిక, ఈ అనైతిక పొత్తు ప్రజలు గుర్తించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం మున్సిపల్ ఫలితాలతో స్పష్టమైందన్నారు. రేవంత్ రెడ్డి నడిపేది కాంగ్రెస్ సర్కారా? బీజేపీ సర్కారా? లేదా బీజేపీ-టీడీపీతో కూడిన సంకీర్ణ సర్కారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆలియాబాద్ నుంచి అమన్‌గల్ దాకా.. మెట్‌పల్లి నుంచి మెదక్ దాకా మీరు సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదని అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కైందన్నారు. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్‍ను నిలువరించి అధికారాన్ని చేపట్టడానికి ఏదో ఒక విధంగా ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏమో దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో బీజేపీతో జత కడుతున్నదన్నారు.

Leave A Reply

Your email address will not be published.