పోలీసుల నిర్లక్ష్యంపై కమిషన్ ను ఆశ్రయించిన 163 మంది న్యాయవాదులు
ముద్ర, హైదరాబాద్ :
న్యాయవాది జి. స్వప్న కుమారి (34) హత్య కేసులో పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. చేవెళ్ల భూ వివాదంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని మృతురాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ, మొయినాబాద్ పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఈ నెల 4న చేవెళ్ల పరిధిలో జరిగిన భూ వివాదంలో న్యాయవాది జి. స్వప్న కుమారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యను నివారించడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ 163 మంది న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తన సోదరుడి నుంచే తనకు ప్రాణహాని ఉందని స్వప్న కుమారి పోలీసులకు ముందే ఫిర్యాదు చేశారన్నారు. అయినప్పటికీ పోలీసులు సకాలంలో నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇది విధి నిర్వహణలో తీవ్ర అలసత్వమని న్యాయవాదులు తమ ఫిర్యాదులో (ఎస్.ఆర్. నం. 515/2026) పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న మానవహక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేశారు.