పీఎం, లోక్ సభ స్పీకర్ పై ఏఐ వీడియో ప్రచారంపై సీరియస్
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న లోక్‌సభ సచివాలయం
న్యూఢిల్లీ :
తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు లోక్‌సభ సచివాలయం సోమవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓంబిర్లాపై ఏఐ వీడియో ప్రచారం చేశారని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని గడువు విధించింది. సభా హక్కులు ఉల్లంఘించి తప్పుడు వీడియోను ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడింది. మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తాజాగా పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి వీధి కుక్కను తీసుకురావడంతో పాటు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలకు కమిటీ సిద్ధమైంది. ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ స్వీకరించింది. ఈ నెల 23లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెను ఆదేశించినట్టు తెలిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 1న ఎంపీ రేణుకా చౌదరి ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు కాంప్లెక్స్ లోకి తీసుకువచ్చారు.