– ఈ ఫలితాలు వారికి చెంపపెట్టు
– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే నిరూపించాం
– 95 మున్సిపాలిటీల కైవసం చారిత్రక విజయం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, మధిర :
కాంగ్రెస్ ను గ్రామీణ పార్టీతో పోల్చి.. బురద చల్లిన వారికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారన్న భట్టి… ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిరలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని భట్టి తెలిపారు. తమ పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదన్న ఆయన ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతోనే పోటీ పడుతున్నామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు. విస్తరిస్తున్న పట్టణాలను అభివృద్ధి చేయడానికి మున్సిపల్ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్యూర్ – క్యూర్ – రేర్” విధానంతో ముందుకు సాగుతున్నారన్నారు. మున్సిపల్ పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి, పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్యూర్ – క్యూర్ – రేర్” లక్ష్యమన్నారు.