Take a fresh look at your lifestyle.

అదో దండుపాళ్యం బ్యాచ్ అసలు దొంగలంతా కేబినెట్ లోనే..రేవంత్ ను వదిలిపెట్టం ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. కేబినెట్‌లో ఉన్నదంతా దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సాగుతున్న విచారణలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికే దుష్ప్రచారం చేస్తున్నారని అసలు దొంగలంతా కేబినెట్‌లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇలా చేసిన రేవంత్ రెడ్డిని అసలు వదిలి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రం కోసం పని చేశాననని కేటీఆర్ చెప్పుకున్నారు. “నా ప్రాంతం కోసం మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేము శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశాం. మేము ఎప్పుడూ టైం పాస్ రాజకీయాలు చేయలేదు.” అని అన్నారు. ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొన్నామని ఎప్పుడూ వారి కుటుంబాన్ని రోడ్డుపైకి లాగలేదన్నారు. “ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదు. మా నాయకుడు కెసిఆర్ మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా నెరవేర్చిన నాయకుడు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్ ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు మేము ప్రజల కోసం చేశామని కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా పరిస్థితి దారుణంగా మారిపోయాయని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తున్న వారిపై కేసులు, వేధింపులు సాగుతున్నాయని ఆరోపించారు. “గత రెండేళ్లుగా చూస్తుంటే ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారు. అందులో భాగంగానే ఈ కాళేశ్వరం డ్రామా, గొర్రెల స్కామ్ డ్రామా, ఫార్ములా ఈ డ్రామా, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నారు.” అని మండిపడ్డారు.

నేను తప్పు చేయలేదు
తాను ఎలాంటి తప్పు చేయలేదని కానీ తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారని ఆరోపించారు. ” నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను నేను ఏనాడూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడలేదు. గత ఏడెనిమిది ఏళ్లుగా నా మీద తీవ్రమైన వ్యక్తిత్వ హననం జరుగుతోంది. నన్ను ఏదో డ్రగ్స్ కేసుల్లోనో, హీరోయిన్లతో సంబంధాలనో ఇరికించాలని చూశారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడలేదని అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అలాంటిదేనని దుయ్యబట్టారు. “ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. నేను అడుగుతాను. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. గత రెండేళ్లుగా ఒక సీరియల్ లాగా లీకులు ఇస్తూ నా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్న వారు ఎవరో నేను అడుగుతాను. మరి నా పరువుకు, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసోళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? అని నేను అడుగుతా. అట్లే ఇంకో మాట కూడా నేను అడుగుతా ఇవాళ. ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి… ఈ రోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడాకెమెరా ముందుకు వచ్చి చెప్పే ఒక్క పోలీసువోడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జనార్ ముందుకు వస్తాడా?” అని ప్రశ్నించారు. “2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యేని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగుతో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమన్నా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు మాకేం తెలుసు? మాకేం సంబంధం? పోలీసులు, దొంగలు – వాళ్లకు వాళ్లకు సంబంధం ఉంటది మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్లకు కూడా నా లాగానే బురద అంటించాలి, వాళ్ళను బద్నామ్ చేయాలి. అందుకే విచారణకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాడు.” అని తీవ్ర ఆరోపణలు చేశారు.

దండుపాళ్యం బ్యాచ్
కేబినెట్ పూర్తిగా దండుపాళ్యం బ్యాచ్‌లా మారిందని కేటీఆర్ ఆరోపించారు. వారి దోపిడీని అడ్డుకుంటున్నామని తమపై కక్ష కట్టారని విమర్శించారు. “మూడు రోజుల కింద హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి బావమరిదే అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నది. కేంద్ర బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమోఅని. రేవంత్ రెడ్డి ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు. ఇవాళ ఒక్క దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాళ్యం ముఠా లెక్క.. క్యాబినెట్‌లో ఎవరైతే ఉన్నారో అందరూ అందినకాడికి దోచుకొనే స్కీమ్ లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటున్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్లకు ఎక్కడలేనీ మంట” అని ఆరోపించారు. తప్పు చేసినవాడు భయపడతాడు, తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి కాదు ఆయన జేజమ్మ కూడా భయపడే సమస్య లేదన్నారు. “ముమ్మాటికి ఒక్కటి మాత్రం పక్కా. ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టం. నా క్యారెక్టర్‌ను బద్నాం చేసిన బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులను, ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులొత్తుతూ పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఎప్పుడంటే అప్పుడు వస్తా
“మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదు, చేయలేదన్న మాటనే చెప్తాం. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్ లాడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదే ఉందో, అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకి ఇచ్చిన ఎగ్గొడుతున్న హామీల మీద ఉంటది.‘‘ అని కేటీఆర్ అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డిగా ఎట్లా మారిపోయాడో అన్న దాని మీద.. 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా చేస్తున్నాడో ఎండగడుతూనే ఉంటామని, 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటామన్నారు. ఎవరికీ భయపడకుండా ఎవరికీ తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ సైనికులుగా, కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.