Take a fresh look at your lifestyle.

మేం ఊరుకోం..సప్త సముద్రాల్లో అవతల దాక్కున్నా లాక్కొస్తాం పోలీసు అధికారులకు హరీష్‌రావు వార్నింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కక్ష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఇందులో అధికారులు పావులుగా మారుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. ఎవర్నీ వదిలి పెట్టబోమన్నారు. శ్రుతిమించి ప్రవర్తిస్తున్న అధికారులు భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చారు. దావోస్‌లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వచ్చే కాలంలో కేసుల్లో ఇరుక్కుంటారని హెచ్చరించారు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నాం తర్వాత ఎవరూ ఏం చేయలేరనే ధీమా వద్దని కూడా చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతామని సీరియస్ అయ్యారు. కేటీఆర్‌తో సిట్ కార్యాలయం వరకు వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. పోలీసు అధికారులు, ప్రభుత్వాధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు సూచించారు. వాటిని మీరితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అండగా ఉండవచ్చేమో కానీ రేపటి రోజున కచ్చితంగా ఇంతకింతా అనుభవిస్తారని అన్నారు. అప్పుడు సొంత డబ్బులు పెట్టి కేసులు వాదించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమపై చాలా కాలం నుంచి దుష్ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పోలీసులు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపేనని హరీష్ అభిప్రాయపడ్డారు. వివిధ స్కామ్‌లలో ఇరుక్కున్న ప్రభుత్వ పెద్దలు వాటి నుంచి ప్రజల దృష్టిన డైవర్ట్ చేయడానికే విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా వేధించినా తమ పోరాటం మాత్రం ఆపేది లేదని ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.