Take a fresh look at your lifestyle.

మరోసారి అన్యాయం … కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి దక్కని ప్రాధాన్యత

  • గుండుసున్నా నిధులు మంజూరు
  • రాష్ట్రానికి చిల్లి గవ్వకూడా  తీసుకరాలేకపోయిన సీఎం,  కేంద్రమంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రజలకు  క్షమాపణలు చెప్పాలి
  • జాతీయ పార్టీలు ఎప్పటికీ  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైంది
  • కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా  బడ్జెట్ రుజువుచేసింది
  • దేశం ఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్దం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-జాతీయ పార్టీలు ఎప్పటికీ  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి  తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి  బిజెపితో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల నేడు ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రానికి  చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్, బిజెపిలకు చెందిన ఎంపీలు  రాష్ట్ర సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కులను, జాతి ప్రయోజనాలను కాపాడగలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్  చెప్పిన మాట ఈ రోజు మరోసారి గుర్తుకు వస్తుందన్నారు. లోక్ సభలో తెలంగాణ పార్టీ అయినా బిఆర్ఎస్ కి ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్,  ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్ధం అయిందని శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ముప్ఫై సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, రాష్ట్రం  నుంచి డీల్లీకి మూటలు మోసేందుకేనని  నేడు చాలా స్పష్టంగా తెలిపోయిందన్నారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్- చోటే భాయ్ అనుబందంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందన్నారు. తెలంగాణ నుంచి మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా.. వారి వల్ల కూడా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే అన్నారు. కేవలం ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప.. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి పోరాడిన దాఖలు లేకపోవడం వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. 
డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు నిధులు తెస్తామంటూ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ గెలిచారని….ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నా  రాష్ట్రానికి  ఒక్క నయా పైసా తీసుకురాలేకపోయారన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు తేలేని బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు  ప్రజలకు క్షమాపణ  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువుచేసిందని  అన్నారు. గత బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదన్నారు. ఈ బడ్జెట్ లోనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు కన్నెత్తైనా చూస్తుందేమో అని నాలుగు కోట్ల ప్రజలు ఎదురుచూశారన్నారు.  కానీ అందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లిందన్నారు. రానున్న ఎన్నికల కోసం బీహార్ కు బంగారుపల్లెంలో వడ్డించి.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఏదీ ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. దేశ అత్యున్నత చట్టసభలో హామీ ఇచ్చిన విభజన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఇన్నాళ్లయినా అమలు చేయని బీజేపీని ఇకపై రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. పక్కనున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధుల సహాయం అందిస్తూ తెలంగాణకు మెండి చూపించారన్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యతలు, కేటాయింపులు చూస్తే, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి, బడ్జెట్ లో ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేయడం సరైన సంస్కృతి కాదన్నారు. దేశం ఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు.

Leave A Reply

Your email address will not be published.