దివ్యాంగ మహిళలు తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో చేరాలి
-కలెక్టర్ సిహెచ్ ప్రియాంక
ముద్ర, నారాయణపేట:
పేదవాడి సొంత ఇంటి కల నెరవేరినప్పుడే నిజమైన సంతృప్తి కలుగుతుందని మంత్రి వాకిటి శ్రీ హరి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్” లో భాగంగా గాయత్రి ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు దివ్యాంగుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్దన్నలా, ఆత్మీయ బంధువులా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఊరిలోనే బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే ప్రధానమని ప్రధానమంత్రి గ్రామానికి వస్తే కూడా ముందుగా గ్రామ అధ్యక్షులు గ్రామ సర్పంచేనని అన్నారు. కావున సర్పంచులు బాధ్యత వహించి గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే కల్యాణ లక్ష్మి పథకంతో పాటు అదనంగా రూ.2 లక్షల వివాహ ప్రోత్సాహక బహుమతి అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా దివ్యాంగుల స్వయం ఆధారిత జీవనానికి దోహదపడే విధంగా 34 రిట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు, పది బ్యాటరీ వీల్ చైర్ ట్రైసైకిల్, ఎనమిది టలాప్టాప్, రెండు చెవి వినికిడి యంత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక మాట్లాడుతూ దివ్యాంగ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించబడతాయని తెలిపారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి పురోగతిని, కార్యక్రమాలను గురించి చదివి వినిపించారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఎస్. శ్రీను, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, ఆర్డీవో ఎల్. రమేష్, జిల్లా మత్స సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్, డీపీవో సుధాకర్ రెడ్డి గారు, ఇతర జిల్లా అధికారులు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.