ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో పిడుగుపాటు ఘటన విషాదాన్ని నింపింది. భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో మూడు పశువులు మృతి చెందాయి.
గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్‌కు చెందిన పశువులను పొలంలో కట్టేసి ఉంచగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వాటిలో కాడెద్దులు కూడా ఉన్నట్లు సమాచారం. వ్యవసాయం కోసం కాడెద్దులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతుకు ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది.
పిడుగుపాటుతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.