Take a fresh look at your lifestyle.

టెంపుల్ టూరిజానికి మరింత ప్రోత్సహాం

  • పారదర్శకంగా సీజీఎఫ్ నిధుల వినియోగం.
  • మంత్రి కొండా సురేఖ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని మరింత ప్రోత్సహిస్తామని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ముఖ్యంగా ఈ అంశంపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆమె సూచించారు. టెంపుల్ టూరిజం సర్క్యూట్లపై మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల‌న్నారు. ఒక జిల్లాలోని మూడు ప్రధాన ఆలయాలను కలిపి ఒక సర్య్కూట్​గా ప్రణాళికలను రూపొంది వెళ్తున్నామ‌ని, ఈ ప్ర‌క్రియ మూడు విడత‌లుగా చేయాల్సి ఉంటుంద‌న్నారు.ప్రముఖ ఆలయాలకు భక్తులు, పర్యాటకులను తీసుకెళ్లడంతో పాటు మార్గం మధ్యలో ఉన్న సందర్శక ప్రాంతాలు తిలకించేలా రూపొందిస్తున్నామని ఆమె చెప్పారు.ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన సీజీఎఫ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రతి పండుగను ఘనంగా నిర్వహించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అషాఢ బోనాల నేపథ్యంలో వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఘనంగా బోనాలు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా సీజీఎఫ్ నిధులను పారదర్శకంగా వినియోగించాలని అధికారులను ఆమె ఆదేశించారు. సీజీఎఫ్ నిధుల కింద చేపట్టిన పనులపై క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం సరికాదన్నారు. సీజీఎఫ్ నిధుల కోసం రెండుమూడు మార్లు పనుల ప్రతిపాదనలు పంపరాదన్నారు. ఏ అంశానైనా సరే ఒకే సందర్భంలో తెలిపాలన్నారు. రాష్ట్రంలోని ఆల‌యాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాల అభివృద్ధి, ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళికతో ముందుకెళ్ళాల‌ని అధికారుల‌కు మంత్రి సురేఖ సూచించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర ఉన్నతాధికారులు, ఈఓలు, సీజీఎఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.