ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ టౌన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లాడ్జీలు, హోటళ్లకు వచ్చే వారి పూర్తి వివరాలు నమోదు చేయాలని, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. లాడ్జీలు, హోటళ్లలో మద్యం సేవించడం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వరాదని హెచ్చరించారు. మైనర్ బాలికలు, అనుమానాస్పద పరిస్థితుల్లో వచ్చిన వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన లాడ్జీ, హోటల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, సిబ్బంది ఉన్నారు.