Take a fresh look at your lifestyle.

చట్టాల మార్పు కాదు – కార్మిక హక్కుల అపహరణ-*ఏఐటీ యూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్*

 

 

ముద్ర : కాప్రా

కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేయబోతున్న నూతన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని,ఇది చట్టాల మార్పు కాదు – కార్మిక హక్కుల అపహరణ అని అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్ అన్నారు . ఈ కోడ్లు కార్మికుల శ్రమను చౌకగా మార్చి, పెద్ద కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రూపొందించిన దోపిడీ విధానాలు మాత్రమేనని, దీనిని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐటీయూసీ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని అంబేద్కర్ కూడలి వద్ద “బ్లాక్ డే”గా పాటిస్తూ,ప్లకార్డులు చేతబూని, నినదిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్ మాట్లాడుతూ కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం ప్రతి కార్మికుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నామన్నారు.
పని గంటల పెంపు – శ్రమ దోపిడీ పెరుగుదల
కొత్త కోడ్ల ద్వారా పని గంటలను పెంచే అవకాశం ఉందన్నారు. ఇది కార్మికుల ఆరోగ్యం, జీవన నాణ్యతను దెబ్బతీస్తుందని, ఉద్యోగ భద్రత లేకపోవడం 300 మందికి లోపల ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ప్రభుత్వం అనుమతి లేకుండా ఉద్యోగాలను తొలగించే స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఉద్యోగ భద్రత పూర్తిగా నశిస్తుందన్నారు. యూనియన్ హక్కులపై పరిమితులు పెట్టారని కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం, సమ్మె చేయడం వంటి హక్కులను పరిమితం చేస్తూ కార్మికుల స్వరాన్ని అణచివేయడం జరుగుతోందన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుదల
పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను ప్రోత్సహించడం ద్వారా కార్మికులను అస్థిర జీవితానికి నెట్టివేస్తున్నారన్నారు. వేతనాలు, సంక్షేమంపై దెబ్బ
మినిమమ్ వేతనాలు, బోనస్, సామాజిక భద్రత వంటి అంశాలను బలహీనపరచి కార్మికుల హక్కులను తగ్గిస్తున్నారన్నారు .
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఎస్. శంకర్ రావు,ఏఐటీయూసీ నేతలు నారా నర్సింహా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.