ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషాలిటీ వైద్య శిబిరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మిషన్–99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ వైద్య శిబిరాల్లో గైనకాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, డెంటల్ మరియు కంటి విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని గ్రామీణ ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకే చోట వివిధ వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది.
తనిఖీ సందర్భంగా డీఎంహెచ్ఓ రోగుల నమోదు విధానం, చికిత్స వివరాలు, మందుల పంపిణీ, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అదేవిధంగా, వైద్య సేవలు పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
ప్రజలకు సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు. శిబిరాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా అందించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ స్పెషాలిటీ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ పిలుపునిచ్చారు.