ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా గ్రామసభల నిర్వహణపై మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం గ్రామ, వార్డ్ సభలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని, సభలకు వచ్చే ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సభల్లో సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనేలా చూడాలన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలు, చేపట్టిన ఆయా అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఆయా పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను ఇప్పటికే సంబంధిత మండలాలకు పంపించినందున సభల్లో వివరించాలన్నారు. కొంతమంది లబ్ధిదారులతో సభల్లో మాట్లాడించాలని, ఆయా పథకాలపై వారి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు వంటి సామాజిక సమస్యలపై కూడా చర్చించాలన్నారు. సభల్లో ప్రజలు ఏమైనా సమస్యలు తెలియజేస్తే వాటిని నోట్ చేసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
వేసవిలో త్రాగునీటి సమస్యల నివారణకు చర్యలు
వేసవిలో జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడకుండా సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సలహాలు, సూచనలు తెలియజేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, వడదెబ్బ బారిన పడిన వారికి అవసరమైన వైద్య సహాయం చేయాలన్నారు. దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలలో, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ కార్మికులు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలన్నారు. 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత కార్యక్రమాల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున అమలు చేయాలన్నారు. సంబంధిత మండలాల అధికారులు తమ పరిధిలోని గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలను తరచు సందర్శించాలని అక్కడి కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. జనాభా గణనకు సంబంధించి ఇప్పటికే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వ విధి విధానాల ప్రకారం సంబంధిత సిబ్బంది ముందుకెళ్లాలన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో సంబంధిత అధికారులు ఎల్లవేళలా ముందుండాలని, జిల్లా అధికార యంత్రాంగం తరపున తాము కూడా ఏ సమస్య వచ్చిన పరిష్కరించేందుకు సహకరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.