హైదరబాద్, ఫిబ్రవరి 16:
చెరువులు, నాలాలు, రహదారులు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలపై హైడ్రా ప్రజావాణికి ప్రతి సోమవారం వచ్చే ఫిర్యాదులకు అగ్ని ప్రమాదాలకు సంబంధించినవి కూడా తోడయ్యాయి. నివాసాలకు చేరువలో ప్లాస్టిక్, స్క్రాప్ దుకాణాలున్నాయని, పైన వసతి గృహాలు.. కిందన హోటళ్లు నిర్వహిస్తున్నారని, సెల్లార్లలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉండే వస్తువులను నిలువ చేస్తున్నారని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు. వీటికి తోడు పలు కాలనీల్లో పార్కులు, రహదారులు కబ్జాకుగురయ్యయనే ఫిర్యాదులు కూడా అందాయి. సోమవారం ప్రజావాణికి వచ్చిన 59 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నేరుగా పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.

* ఫిర్యాదులు ఇలా..
వస్త్ర దుకాణదారులు, ఫర్నీచర్ షాపుల వారే కాదు.. నివాస ప్రాంతాల మధ్య వాణిజ్య కార్యకాలాపాలు నిర్వహిస్తున్న భవనాలు కూడా అగ్ని ప్రమాదానికి ఆస్కారంగా ఉన్నాయని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు44లో నివాసం ఉన్న వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు సెల్లార్లో నిలువ ఉంచుతున్నారని.. వెంటనే తనిఖీలు చేసి ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
* మాధాపూర్ ప్రాంతంలో పైన హాస్టళ్లు నిర్వహించి.. గ్రౌండ్ ఫ్లోర్‌లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లు, క్యాంటిన్లు నడుపుతున్నారని.. .. ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఊహించడం కష్టమని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే తనిఖీలు చేసి అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారో లేదో చూడాలని కోరారు. కచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి ప్రధాన రహదారిని 6 లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న వరద కాలువను ప్రగతినగర్ మీదుగా వెళ్లే మురుగు కాలువకు అనుసంధానం చేస్తున్నారని.. దీంతో వరద ముప్పు తలెత్తే అవకాశం ఉందని.. నిర్మాణ దశలోనే సరైన చర్యలు తీసుకోవాలని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ రోడ్డు అభివృద్ధి పనులు చేపడుతున్నవారు ఎవరికి వారు.. వాళ్ల పని పూర్తి చేశామా లేదా అనేదే చూస్తున్నారు కాని.. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను పట్టించుకోవడంలేదని వాపోయారు.
* సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం డివిజన్ శ్రీనివాస నగర్‌లో హనుమాన్ టెంపుల్‌కు ఆనుకుని ప్రజావసరాలకు ఉద్దేశించిన ప్రభుత్వ స్థలాన్ని కుల సంఘాల కార్యాలయాలు పేరిట కబ్జాలు చేస్తున్నారని.. అడ్డుకుంటే తమపై దాడి చేస్తున్నారని అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. వెంటనే హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ స్థలాన్ని కాపాడాలని కోరారు.
* శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరి నగర్‌లోని పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు ఆక్రమణకు గురయ్యాయని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇందులో 3600ల గజాల పాఠశాల స్థలం, కాలేజీకి ఉద్దేశించిన స్థలం 4 ఎకరాలు, కమ్యూనిటీ హాల్ కోసం 2181 గజాలు, పార్కుల్యాండ్ 4387 గజాల స్థలాలు కబ్జాలకు గురౌతున్నాయని వెంటనే వీటిని రక్షించాలని కోరారు.