Take a fresh look at your lifestyle.

ఢిల్లీకి రండి…

సీఎం, మంత్రులు, కీలక నేతలకు ఏఐసీసీ పిలుపు
కీలక అంశాలపై చర్చ.. భవిష్యత్ కార్యాచరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు రాజకీయ చతురతతో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో మరింత బలోపేతమయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా.. పలువురు కీలక నేతల మధ్య విభేదాలు, అంతర్గత పొరపచ్చాలతో భవిష్యత్తులో ఇతర పార్టీల విమర్శలకు ఆస్కారం ఇవ్వొద్దని భావిస్తోన్న అధిష్టానం దీనికి చెక్ పెట్టాలని యోచిస్తున్నది. నేతల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన ఏఐసీసీ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలను ఈ నెల 19వ తేదీన ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సారథ్యంలో కీలక సమావేశం జరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజారిటీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై లోతుగా చర్చించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం ఈ భేటీ ద్వారా లభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీ పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.