ముద్ర : మల్కాజిగిరి
మల్కాజ్‌గిరి నియోజకవర్గం అల్వాల్ పరిధిలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల 7వ, 8వ, 9వ తరగతుల విద్యార్థుల కోసం మల్కాజ్‌గిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్శనలో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇటీవల అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా, విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాలన ఎలా నిర్వహిస్తారో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంటో అనే అంశాలపై అవగాహన కల్పించాలనే హామీ ఇచ్చిన శాసన సభ్యులు, ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకుంటూ విద్యార్థులకు అసెంబ్లీ గ్యాలరీని ప్రత్యక్షంగా దర్శించేందుకు అవకాశం కల్పించారు.
విద్యార్థులు అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్శన ద్వారా, వారిలో ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెరిగినట్లే కాకుండా, భవిష్యత్తులో మంచి ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని ప్రేరణ పొందారు.
ఈ సందర్భంగా, ఎమ్మెల్యే విద్యార్థులకు క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఇతర బోర్డు సభ్యులు, పలువురు అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.