Take a fresh look at your lifestyle.

తెలంగాణ రైజింగ్​.. బ్రాండ్​ ఏపీ

 

  • దావోస్​లో తెలుగు సవాల్​
  • ఇద్దరు సీఎంల మధ్య పెట్టుబడుల యుద్ధం
  • చంద్రబాబు, రేవంత్ సమర్దతకు పరీక్ష
  • ఇటు శ్రీధర్​బాబు.. అటు లోకేశ్
  • బలనిరూపణలో ఇద్దరు మంత్రులు
  • పెట్టుబడులపై విమర్శలకు విపక్షాల కత్తులు
  • ఏపీకి ఎక్కువ వస్తే తెలంగాణలో బీఆర్​ఎస్​..
  • తెలంగాణకు పెట్టుబడులు పెరిగితే ఏపీలో వైసీపీ ఎదురుదాడి
  • తెలుగు సర్కార్లకు గండం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కొత్త పోటీ మొదలైంది. ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్దిక సదస్సు లో ఇద్దరూ పాల్గొనేందుకు తమ టీంలతో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నేతలు జ్యూరక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. కానీ, పెట్టుబడు ల ఆకర్షణలో మాత్రం పోటీ తప్పేలా లేదు. దీంతో, ఇద్దరికీ ఈ సదస్సు పరీక్షగా మారుతోంది. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇలా వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం సదస్సుల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సీఎంలది గురుశిష్యుల బంధం. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి ఒక ప్రధాన శిష్యుడు అనేది బహిరంగ ప్రచారమే. పార్టీలు వేరైనా.. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనేది రెండు రాష్ట్రాల్లో తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు పెట్టుబడుల కోసం మాత్రం తమ స్టేట్​ అంటే తమ స్టేట్​ అంటూ ఇద్దరూ గొప్పలు చెప్పుకోక తప్పడం లేదు.

 

దావోస్ లో ప్రపంచ ఆర్దిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ చేరుకున్నారు. జ్యూరక్ విమానాశ్రయంలో ఇద్దరు సీఎంల మధ్య మాటా మంతి జరిగాయి. జ్యూరిచ్ లోని హోటల్ హిల్టన్ లో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పొరా మీట్ లో వీరిద్దరూ పాల్గొన్నారు. యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. స్థానిక రాయబార కార్యాలయం ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఆ వెంటనే ఇరు రాష్ట్రాల సీఎంలు దావోస్ చేరుకున్నారు.

 

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమ బృందాలతో హాజరయ్యారు. తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో పెట్టుబడుల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ పెట్టుబడుల పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఇరువురికీ సమానమైన సానుకూల, ప్రతికూల అంశాలున్నాయి.

జ్యూరిక్​లో స్వాగతం

జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జ్యూరిచ్‌ వెళ్లిన ఏపీ అత్యున్నత స్థాయి బృందంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రు లు లోకేష్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. రేవంత్ టీంలో మంత్రి శ్రీధర్ బాబు తో సహా అధికారులు పాల్గొంటున్నారు. 2014–-19 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయం లోనూ దావోస్ సదస్సుకు హాజరయ్యారు. గత ఏడాది ఈ సదస్సులో పాల్గొన్న రేవంత్ వరుసగా రెండో ఏడాది హాజరవుతున్నారు. దీంతో.. మూడు రోజుల పాటు సాగే పెట్టుబడుల సదస్సులో పలువురు ప్రముఖులతో ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ పెట్టుబడుల కోసం ఈ ఇద్దరు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.

అనుకూలం.. సానుకూలం

ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడుతున్నాయి. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాదే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓ పెద్ద సానుకూలాంశమని భావిస్తున్నారు. ఇంతకు ముందు సింగపూర్​లో మూడు రోజులు పర్యటించిన సీఎం రేవంత్​ బృందానికి ఆశించిన ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో.. ప్రధానంగా హైదరాబాద్​కు పెట్టుబడుల కోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు తరలివస్తారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, లాభాలను అందిపుచ్చుకుంటున్నాయి. అందుకు అవసరమైన పూర్తి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కూడా ఉండడంతో ఇన్వెస్ట్ చేయాలనుకునే కంపెనీలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరముండదని భావిస్తున్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఈ విషయంలో అపారమైన అనుభవం ఉంది. గతంలోనూ ఆయన పలుమార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యారు. అంతేకాదు అభివృద్ధి, దార్శనికతలోనూ చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దీంతో సీఎం పెట్టుబడిదారులకు కొత్త వ్యక్తే కాదు. అందువల్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది ఉత్తమ కారణంగా ఏపీ అంచనా వేస్తున్నది. ఈ సమయంలోనే కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. గత ఐదేళ్ల జగన్ పాలనలో బ్రాండ్ ఏపీ ఇమేజ్ కారణంగా ఏపీ స్టేట్​ వాల్యూ కొంత దిగజారిందనే అభిప్రాయాలున్నాయి. దీంతో మళ్లీ జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడిదారుల నుంచి ప్రధానంగా ఎదురవుతున్నది.

రైజింగ్​ తెలంగాణ

రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నాయి. ఇటు పరిశ్రమలకు సాయంగా ఉంటామని ప్రభుత్వం తరపున పదేపదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​ బృందం.. తెలంగాణ రైజింగ్​పేరుతో కొత్త కొత్త అవకాశాలను పెట్టుబడిదారులకు చూపిస్తున్నది. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డికి కూడా చాలా అంశాల్లో అనుకూల పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. పాలనలోనూ సక్సెస్​ అయ్యారనే భావిస్తున్నారు.

‘బ్రాండ్ ఏపీ’ని ప్రమోట్ చేయనున్న ఆంధ్రా సీఎం

ఉపాధి ఆధారిత పారిశ్రామిక విధానాలను హైలైట్ చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సుస్థిర నాయకత్వం, సమర్థవంతమైన వ్యాపార వాతావరణంతో సహా రాష్ట్ర బలాబలాలను నొక్కి చెప్పేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటారని ఇటీవలే ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే “మీట్ అండ్ గ్రీట్ తెలుగు డయాస్పోరా” కార్యక్రమంలో, సీఎం పెట్టుబడి అవకాశాల గురించి చర్చించి ఏపీని ప్రమోట్ చేస్తున్నారు.

ఇటు శ్రీధర్​బాబు.. అటు లోకేశ్

​మరోవైపు ఇద్దరు కీలక మంత్రులు కూడా దావోస్​లో బల నిరూపణకు దిగుతున్నారు. కొంత అనుభవం ఉన్న మంత్రిగా శ్రీధర్​బాబు ఇప్పటికే ముందంజలో ఉన్నారు. విదేశీ పర్యటన మొత్తం శ్రీధర్​ బాబు నేతృత్వంలోనే సాగుతున్నది. ఐటీ, ఇండస్ట్రీ మంత్రిగా కొన్ని కంపెనీలు తీసుకురావడంలో సక్సెస్​ సాధించారు. అంతేకాకుండా ఇలాంటి కీలక అంశాలన్నీ సీఎం రేవంత్​కూడా.. మంత్రి శ్రీధర్​బాబుకే పూర్తి స్వేచ్ఛ అప్పగించారు. ఇక, లోకేశ్​ కూడా చంద్రబాబు చాటు బిడ్డగా కొంత ప్రచారం జరుగుతున్నా.. ఇటీవల కొంత దూకుడు పెంచుకున్నారు. కానీ, ఆయన సొంతంగా పెట్టుబడులు తీసుకురావడంలో.. కొంత వెనకబడ్డినట్టే ఉన్నారు. తెలంగాణ మంత్రి శ్రీధర్​బాబుతో పోలిస్తే.. వెనకంజలో ఉన్నట్లే కనిపిస్తున్నారు. కానీ, చంద్రబాబు నేతృత్వంలో కంపెనీలను ఆకట్టుకోవడంలో ముందుంటారని ఒక ఆశ.

విమర్శల కత్తులు పట్టుకున్న విపక్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దావోస్​లో పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటే.. ఇక్కడ విపక్షాలు మాత్రం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడుల అంశంపై తెలంగాణలో బీఆర్​ఎస్​, ఏపీలో వైసీపీ విమర్శలు పెంచాయి. ఇదే సమయంలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వస్తే.. ఇదే అదునుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు పెంచనున్నది. గతంలో బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులను లెక్కలేయనున్నారు. అంతేకాకుండా చంద్రబాబు కోసం రేవంత్​ రెడ్డి.. పెట్టుబడులను త్యాగం చేశారనే విమర్శలు కూడా రానున్నాయి.

ఇదే సమయంలో వైసీపీ కూడా అదే చాన్స్​ కోసం ఎదురుచూస్తున్నది. ఇప్పటికే పెట్టుబడులు ఏపీకి చాలా వెనకబడ్డాయి. సుదీర్ఘపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు.. దావోస్​కు వెళ్లి తెలంగాణకు తొలిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్​రెడ్డి కంటే తక్కువ పెట్టుబడులు తెచ్చారంటూ ఎదురుదాడికి దిగనున్నది. ఇక్కడ కూడా రేవంత్​ కోసం చంద్రబాబు ఏదో ప్లాన్​ చేశారనే విమర్శలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పుడు పెట్టుబడులు తీసుకురావడంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ.. ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.