- బీఆర్ఎస్ హయంలో కార్మిక వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది
- కేసీఆర్ సీఎం అయిన మొదటి పక్షంలో రోజుల్లోనే హమాలీల సమస్యలకు ముగింపు పలికారు
- రూ. 8 లు ఉన్న కూలీని రూ. 26 లకు పెంచారు
- వలస వచ్చిన 35 లక్షల మంది రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు
- ఇది కార్మికుల పట్ల కేసీఆర్ కున్న ప్రేమకు నిదర్శనం
- బీఆర్ఎస్ కార్మిక విభాగం డెైరీ ఆవిష్కరణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా….పోరాట పటిమ మాత్రం పోలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ కష్టమొచ్చిన ముందుండేది గులాబీ పార్టీ మాత్రమేనని అన్నారు. రేవంత్ రెడ్డి భూటకపు హామీలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్ ను ఓడగొట్టినప్పటికీ….వారి హృదయాల్లో మాత్రం శాశ్వత స్థానం కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ హయంలో అన్ని వర్గాలు హాయిగా ఉంటే….రేవంత్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నాయన్నారు. ఏదో ఒక రోజున ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.
సోమవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్మిక విభాగం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో కడు పేద కార్మిక వర్గమైన హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయిన 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావకముందు వరకు హమాలీల కూలీ కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఉండేదన్నారు. దానిని రూ. 26లకు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.
కరోనా కాలంలో రాష్ట్రంలో ఉన్న సుమారు 35 లక్షల మంది వలస కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అన్ కేసీఆర్, మనసున్న నేతగా…కార్మిక పక్షపాతిగా కరోనా కాలంలో వలస కార్మికులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సహాయం చేసి, భోజనం పెట్టి ప్రత్యేకంగా రైళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళందర్నీ స్వస్థలాలకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఆయన ఒక్కరే అని అన్నారు. అది కేసీఆర్ నాయకత్వం. కార్మికుల పట్ల ఉన్న ఆయనకున్న ప్రేమకు నిదర్శనమన్నారు. వలస కార్మికులు తెలంగాణ వాళ్లు కాదని తెలిసినా, వాళ్ళు ఎవరూ తనకు ఓటు వేయరని తెలిసినా కూడా కార్మిక పక్షపాతిగా వాళ్ల కోసం పనిచేశారన్నారు.
2004లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా వేలాది ఇండ్లను కార్మికులకు కేసీఆర్ మంజూరు చేశారన్నారు. అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2005వ సంవత్సరంలోనే కార్మిక శాఖ మంత్రిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పించి అర్జున్ సైన్ గుప్తా అనే ఆర్థికవేత్త ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రొఫెసర్ జయశంకర్ ను అందులో మెంబర్ గా చేసి ఒక నివేదిక తయారుచేయించారని గుర్తు చేశారు.
సఫాయి అన్నా నీకు సలాం అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరన్నారు. సఫారీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. ఒక్క జిహెచ్ఎంసి లోనే సఫాయి కార్మికులకు మూడుసార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఆనాటి పాలకులు అంగన్ వాడి టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ …. అదే అంగన్వాడీ టీచర్లకు రూ.4500 ఉన్న జీతాన్ని రూ.13,650 కు పెంచారన్నారు. మినీ అంగన్వాడి టీచర్లకు రూ. 2200గా ఉన్న జీతాన్ని రూ. 7800 చేశారన్నారు. 2014లో ఆశా వర్కర్లకు రూ. 2500 రూపాయల జీతం ఉంటే దానిని రూ. 9750 కు పెంచారన్నారు.
దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం గా తెలంగాణను కేసీఆర్ నిలిపారన్నారు. మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, దాదాపు 12 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఆర్సిని వర్తింప చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారత దేశంలో బీఆర్ఎస్సేనని అన్నారు.అలాగే గుడి పూజారులకు, మస్జిద్ల మౌలానా, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కూడా కేసీఆర్ యేనని అన్నారు. అలాంటి కేసీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత పార్టీ కార్మిక విభాగం మీద ఉందన్నారు.
కార్మిక విభాగానికి త్వరలో కొత్త కమిటీలు
రాష్ట్రంలోని 33 జిల్లాలకు బీఆర్ఎస్ కార్మిక విభాగానికి కొత్త కమిటీలను కొత్త నాయకులను ఎన్నుకోవాలని కేటీఆర్ సూచించారు.ముఖ్యంగా కార్మికులను అన్ని విధాలుగా మోసం చేసిన రేవంత్త్ రెడ్డికి చుక్కలు చూపించే నాయకులను ఎన్నుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడొద్దు అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రతిక్షణం గుర్తు చేద్దామన్నారు. వెంబడిపడి ఈ నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించే బాధ్యతను కార్మిక విభాగం తీసుకోవాలన్నారు. ఇందుకు పార్టీ నాయకత్వం లీగల్ సేల్ కార్మిక విభాగానికి అండగా ఉంటుందన్నారు.
Prev Post
Next Post