Take a fresh look at your lifestyle.

ఫీజు రీయింబర్స్ మెంట్ పై దద్దరిల్లిన అసెంబ్లీ ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అసెంబ్లీ ప్రాంగణం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో మార్మోగింది. రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో భారీ నిరసన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నట్టే, ఇప్పుడు విద్యార్థుల జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందక వేల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం మరింత పటిష్టంగా కొనసాగించి విద్యార్థుల బంగారు బాటకు మార్గం చూపిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని, తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ నిరసనలో పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.