- భయం.. భయంగా ఉంది.
- శ్రీనగర్‌లో తెలంగాణ పర్యాటకులు.
- ఓ చిట్‌ఫండ్ తరపున టూర్‌కు వెళ్లిన 80 మంది.
- ఆర్మీ కంట్రోల్లో వారున్న హోటల్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : శ్రీనగర్‌లో తెలంగాణ వాసులు చిక్కుకుపోయారు.ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులకు భయం భయంగా గడుపుతున్నారు.తాజాగా ఈ మంగళవారం తెలంగాణ జిల్లాల నుంచి పలువురు శ్రీనగర్‌కు పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో ఉగ్రదాడి జరడంతో వీళ్లు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఓ హోటల్‌లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు.దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు.తామందరం కూడా హోటల్‌లో చిక్కుకున్నామని..మమ్మల్ని హైదరాబాద్‌కు సురక్షితంగా తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హోటల్‌లో చిక్కుకున్న వాళ్లలో హైదరాబాద్ నుంచి 20 మంది ఉన్నారు. వరంగల్ నుంచి 10 మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ నుంచి 15 మంది, సంగారెడ్డి నుంచి 10 ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్లందరూ మంగళవారం జమ్మూకశ్మీర్ సందర్శనకు వెళ్లగా..శ్రీనగర్ హోటల్‌లోకి చిక్కుకుపోయారు.జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో గాయపడిన విషయం తెలిసిందే.ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.దీంతో కాశ్మీర్ లోని అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలని వెళ్లిన 80 మంది తెలంగాణ పర్యాటకులు ఆందోళనలో ఉన్నారు.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకు బిక్కుబిక్కుమంటూ ఓ హోటల్ లో తలదాచుకున్నారు.తమని రక్షించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి దృష్ట్యా కాశ్మీర్ పర్యటనలో ఉన్న దాదాపు 80 మంది భయబ్రాంతులకు లోనవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ శ్రీనగర్‌లోని హోటల్‌లో పర్యాటకులు తలదాచుకున్నారు.తమను స్వస్థలాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ భాయానక వాతావరణం నెలకుందని..బయటకు వెళ్తామంటే భయంగా ఉందని తమను సొంతూళ్లకు పంపే ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.వేసవి సెలవులు కావడంతో వీళ్లంతా జమ్మూ కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో విహరించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కాశ్మీర్ వెళ్లారు. ఓవైపు భద్రతా దళాలు భరోసా ఇస్తున్నా వీరు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఉగ్రదాడితో కర్ఫ్యూ విధింపుతో వీరంతా హోటల్‌లోనే ఉండిపోయారు.షెడ్యూల్ ప్రకారం బుధవారం వీరంతా పహల్గాం పర్యటనకు వెళ్లాల్సి ఉంది.తిరిగి ఈనెల 26న టూర్ ముగించుకుని స్వస్థలాలకు రావాలని ప్లాన్ చేసుకున్నారు. ఉగ్రమూకల దాడితో పర్యాటకులందరూ శ్రీనగర్‌లోనే ఉండిపోయారు.
- తప్పించుకున్నాం.
కళ్లముందే మృత్యువు తాండవం చేస్తుంటే.. దగ్గరగా వెళ్లివచ్చామంటూ అక్కడి పరిస్థితిని వీడియోల ద్వారా పంపించారు. ఇక, కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన వేళ..బతికి బయటపడ్డవారు తమ అదృష్టం బాగుందని భావిస్తు్నారు. కొందరు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకుంటే..కొందరు షెడ్యూల్ వలన దగ్గర్లోనే ఉండాల్సి వచ్చింది. చివరికి షెడ్యూల్ లేటుగా ఉండటం కలిసొచ్చిందని అనుకుంటున్నారు.సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కొందరు పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ టూర్ కు వెళ్ళగా.. వారిలో మెదక్ పట్టణంలోని కపిల్ చిట్స్ ఆఫీస్ మేనేజర్ పవన్ దంపతులు, ఏజెంట్ రామకృష్ణ దంపతులు ఉన్నారు. మంగళ వారం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో జమ్మూ వెళ్లి.. మధ్యానం 2 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళారు. 3 గంటలకు హోటల్ కు చేరుకున్నారు. కాసేపు సేదతీరాక తరువాత శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ వెళ్ళారు కపిల్ చిట్స్ ఉద్యోగులు. గురువారం పర్యాటక ప్రదేశమైన పహల్ గావ్ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. అంతలోనే అక్కడ ఉగ్ర వాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారనే వార్త రావడంతో షెడ్యూల్ లేట్ గా ఉండటం వలన ఊపిరి పీల్చుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లిన టూరిస్ట్ లు హోటల్ లోనే ఉండిపోయారు. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ ప్రాంతం ఆర్మీ కంట్రోల్ ఉందని, కర్ఫ్యూ వాతావరణం నెలకొందని అక్కడున్న వారు తెలిపారు. ఫ్లైట్ దొరికితే హైదరాబాద్ తిరిగి వస్తామని వీడియోల ద్వారా చెప్పారు.