Take a fresh look at your lifestyle.

“మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పారిటీలు నిబంధనలు ఉల్లంఘించాయంటూ ఫిర్యాదులు”

నిబంధనలు అతిక్రమించారు.. చర్యలు తీసుకోండి
బీజేపీ, ఎంఐఎం, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎస్ఈసీకి కాంగ్రెస్ లేఖ
సీఎం రేవంత్ పై జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

ముద్ర, తెలంగాణ బ్యూరో:

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాలు దువ్వుతోన్న రాజకీయ పార్టీలు.. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుస్తున్నాయి. ప్రచార పర్వం నున్వా నేనా అన్నట్లుగా సాగుతున్న వేళ బీజేపీ, ఎంఐఎం, మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పి.రాజేశ్ కుమార్ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదినికి లేఖ రాశారు. ఈ నెల 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్, 6న ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్‍ ప్రభుత్వ జూనియర్ కాలేజీ బోధన్ గ్రౌండ్ లో సభలు నిర్వహించారని చెప్పారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధం అన్నారు. ఎస్ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం విద్యా సంస్థలు, వాటి ప్రాంగణాలను రాజకీయ ప్రచారాలు, సభల కోసం ఉపయోగించరాదనే నిబంధనలు ఉన్న విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. అయినా బహిరంగ సభల నిర్వహణ, ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికల అధికారులు అనుమతులివ్వడంపై సందేహాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించించి అనుమతులు ఇచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్లు / ఎన్నికల అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

డబ్బులు తీసుకుని ఓట్లు వేయమన్నారని:
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్, జిన్నారం మున్సిపాలిటీల్లో పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిరాని రాజేశ్ కుమార్ ఎస్ ఈ సీకి మరో లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని బీఆర్ఎస్‍కు ఓటు వేయాలని హరీశ్ రావు ఓటర్లను కోరారని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇది ఓటర్లను లంచం ఇచ్చి ప్రభావితం చేసే ప్రయత్నంగా, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే చర్యగా స్పష్టం అవుతుందన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను బహిరంగంగా దిక్కరించడంతో పాటు న్యాయమైన ఓటు హక్కును కూడా దెబ్బతీస్తాయన్నారు. దీంతో ఎంసీసీని ఉల్లంఘంచిన ఎన్నికల సమగ్రతను ప్రమాదంలోకి నెట్టిన హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి..
ఈ నెల 6న నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బంధాన్ని అవిభక్త కవలలైన వీణ-వాణిలతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్… శనివారం రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయాల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి మానవత్వం మరిచి మాట్లాడుతున్నారని ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వీణ-వాణిల ప్రస్తావన తీసుకురావడం చాలా పెద్ద తప్పు అని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్‌ది ఫెవీకాల్ బంధం అనే వరకూ ఓకే.. ఇలాంటి విమర్శలు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి.. కానీ వీణ-వాణిల ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది అని అర్వింద్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.