Take a fresh look at your lifestyle.

తెలంగాణ హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి: సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన ఆరు హామీలు పూర్తిగా అమలు చేశామని పేర్కొంటూ, అవసరమైతే కేరళ మంత్రివర్గం వచ్చి పరిశీలించవచ్చని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని రామకృష్ణ విమర్శించారు. తెలంగాణలో ఏమి సాధించారో ఇక్కడి ప్రజలకు, సిపిఐ, సిపిఎం నాయకులకు వివరించడం అవసరమని అన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తగదని, ముందుగా తెలంగాణలో తన ప్రభుత్వ పనితీరును సమర్థించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేయని పలు హామీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పినా అమలు కాలేదని, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలు గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రారంభమైనవే తప్ప కొత్తగా పెద్దగా అవకాశాలు కల్పించలేదన్నారు.

అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నిలిచిపోయిందని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున అందరికీ అందడం లేదని తెలిపారు. కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.

పెన్షన్‌ను రూ.4,116లకు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదని, యువ వికాసం పేరుతో రూ.5 లక్షలు, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌ను రూ.500లకు అందిస్తామని చేసిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 200 గజాల స్థలాలు ఇస్తామని చెప్పిన మాటలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

చివరిగా, ఈ అన్ని హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, ప్రజలకు నిజ స్థితి తెలియజేయాలని కె. రామకృష్ణ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.