Take a fresh look at your lifestyle.

ఢిల్లీ కాంగ్రెస్ ధర్నాలో బీబీనగర్ నేతల గర్జన

బీబీనగర్, ముద్ర విలేకరి: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం పరిధిలోని బీబీనగర్ మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాలలో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని కోరుతూ తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ఈ ధర్నా చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోని వచ్చిన ఏడాదిన్నరలోనే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను చేపట్టిన ప్రభుత్వం… ఆ గణాంకాల ఆధారంగా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే ఈ బిల్లును లోక్ సభ, రాజ్యసభలో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ బుధవారం ధర్నా చేపట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లాయి. భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో బీబీనగర్ మండల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గర్జించారు. బీబీనగర్ నుంచి పాల్గొన్న నాయకులలో గోలి పింగళ్ రెడ్డి, పంజాల రామాంజనేయ గౌడ్, దండెం ప్రభాకర్, గడ్డం బాలకృష్ణ గౌడ్,  గోలి నరేందర్ రెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, బీబీనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎండీ మొయిన్, వాసుదేవరెడ్డి, శ్రీకాంత్, నిఖిల్ రెడ్డి, శివకుమార్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.