Take a fresh look at your lifestyle.

అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి

 

కొంపముంచిన హరీశ్..
అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలిన మైనింగ్ మాఫియా
మంత్రి పొంగులేటీ టార్గెట్ గా హరీశ్ ప్రయత్నం
మొత్తం చిట్టా చదివిన సీఎం రేవంత్
పాత ప్రభుత్వంలోనే మైనింగ్ మాఫియా
ఎవరెవరు.. ఎక్కడెక్కడో లిస్ట్ చదివిన సీఎం
హరీశ్ రావు లేవనెత్తిన అంశమే బీఆర్ఎస్ కు షాక్
మాజీ మంత్రిపై మండిపడుతున్న గులాబీ నేతలు
తమ వ్యాపారాలను సమర్ధించుకోలేక తంటాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ అంశమే కీలకమైంది. ఈ అంశాన్ని ఏవో ఆధారాలు అంటూ చూపించే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్.. అదే మైనింగ్ మాఫియాలో చిక్కింది. మంత్రి పొంగులేటీని టార్గెట్ చేద్దామని ప్రయత్నిస్తే.. అదే తుపాకీ బీఆర్ఎస్ వైపు తిరిగి.. బుల్లెట్లు దూసుకువచ్చాయి. ఫలితంగా హరీశ్ రావు పెట్టిన చిచ్చు.. గులాబీ దళానికే ముల్లులా గుచ్చుకున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ దూకుడుకు కనిపించింది. మంత్రి పొంగులేటి మీద హరీశ్ రావు సంధించిన విమర్శలు.. ఆరోపణలు పదునుగా ఉండటం ఒక ఎత్తు అయితే.. అంతే దూకుడుగా సమాధానం చెప్పే విషయంలో సభలో ఉన్న సీనియర్ మంత్రుల నుంచి మిగిలిన అధికార పార్టీ సభ్యుల వరకు ఎవరూ సరైన రీతిలో రియాక్టు కావడం లేదని బీఆర్ఎస్ సంబురపడింది. కానీ, ఆ సంబురం ఎంతోసేపు నిలబడలేదు. సీఎం రాగానే.. బీఆర్ఎస్ మైనింగ్ మాఫీయాపై ఎదురుదాడి చేశారు.

కొంప ముంచావు హరీశా..
నాలుగైదు ఫైళ్లు పట్టుకుని.. ఏదో ప్లాన్ చేసుకొని వచ్చిన హరీశ్ రావు.. అధికారపక్షానికి పగలే చుక్కలు కనిపించేలా మంత్రి పొంగులేటి కుటుంబ మైనింగ్ యవ్వారం మీద ఘాటైన వాదననను వినిపించారు. ఉత్త మాటలు కాదు ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆయన పలు డాక్యుమెంట్లు చూపిస్తూ తన పదునైన వాదనను వినిపించటం మొదలు పెట్టారు. సభలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎవరూ కూడా హరీశ్ రావు వాదనకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేని పరిస్థితి. ఇటీవల కాలంలో విపక్ష నేత వాదనకు అధికారపక్షం ఇంతలా తేలిపోవటం.. కళ్ల ముందే విపక్ష అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. మంత్రి పొంగులేటికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లుగా కనిపించింది.

సీఎం ఎంట్రీ.. సీన్ రివర్స్
దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ వ్యవహారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన పది నిమిషాలకు సీన్ మారింది. అప్పటివరకు హరీశ్ రావు వాదనకు తిరుగులేదన్నట్లుగా సాగిన దానికి భిన్నంగా సీఎం రేవంత్ ఎదురుదాడి మొదలైంది. మంత్రి పొంగులేటి ఒక్కరి అంశాన్నే హరీశ్ రావు నమ్ముకొని సభలోకి రావటం.. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మైనింగ్ వ్యవహారంలో ఎంతమంది గులాబీ నేతల పాత్ర ఉందన్న విషయాన్ని చెప్పేలా తన వాదనను వినిపించారు. అప్పటికప్పుడు బీఆర్ఎస్ కు చెందిన నేతలు.. వారికి ఉన్న మైనింగ్ సంస్థల పేర్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి సుపరిచితమయ్యేలా సీఎం తన వాదనను వినిపించారు. అప్పటివరకు దాడి చేయటం హరీశ్ వంతు.. ఆ మాటల దెబ్బలకు కాచుకునే ఆత్మరక్షణ విధానాన్ని కాంగ్రెస్ మంత్రులు అనుసరిస్తే.. సీఎం రేవంత్ పుణ్యమా అని.. ఎదురుదాడి ముఖ్యమంత్రిది అయితే.. ఆత్మరక్షణలోకి హరీశ్ అండ్ కో వెళ్లారు. మంత్రి పొంగులేటి అండ్ ఫ్యామిలీ వాదనకు ప్రతిగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన హరీశ్ రావు, ఆయన సోదరుడు మొదలు కొని మైనింగ్ శాఖను ఐదేళ్లు నిర్వహించిన కేటీఆర్ మొదలు.. పలువురు నేతల తీరును వారి ఘనకార్యాలు ఎంత భారీగా ఉన్నాయో తెలుసా అధ్యక్షా? అన్నట్లుగా సీఎం రేవంత్ వాదనలతో సీన్ పూర్తిగా మారిపోయింది.

గులాబీ దళం అంతర్మథనం
అప్పటివరకు విచారణకు ఆదేశిస్తారా? ఆ ధైర్యం ఉందా? అంటూ విరుచుకుపడుతున్న హరీశ్ సవాల్ కు అంతే ధీటుగా స్పందించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో అమలు చేసిన మైనింగ్ పాలసీ మొదలు.. వివిధ ఆరోపణలు ఉన్న వారందరిపైనా సీబీసీఐడీ విచారణ చేపడతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ మాట గులాబీ నేతలకు కొత్త గుబులుగా మారింది. అధికారపక్షానికి దెబ్బేయటమే లక్ష్యంగా మొదలైన హరీశ్ వాదన.. చివరకు తమకే భారీ దెబ్బగా మారటాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో చేశావేంటి హరీశా? అంటూ బీఆర్ఎస్ నేతలు గుసగుసలు ఇప్పుడు ఆ పార్టీలో కొత్త చర్చకు తెర తీశాయి. ఇదంతా చూసిన ఒక సీనియర్ బీఆర్ఎస్ నేత తన సన్నిహితులతో చెప్పిన మాటను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ ను ఎఫ్పుడైతే మా వాళ్లు తక్కువగా అంచనా వేయటం మానేస్తారో.. అప్పుడు మార్పు వస్తుంది.

చిట్టా విప్పిన సీఎం
తెలంగాణ ప్రాంతంలో చెప్పినట్టే.. తాటిని తన్నేటోడు ఒకడుంటే.. వాడి తలను తన్నేటోడు మరొకడు ఉంటాడని. ప్రత్యర్థిని అంచనా వేయటం.. అతడి శక్తియుక్తులు..సామర్థ్యాలపై అవగాహనలోని లెక్కలు ఏ మాత్రం తప్పినా.. దానికి చెల్లించాల్సిన మూల్యం ఉంటుంది. అందునా.. రాజకీయంలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా.. శనివారం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ నేతలు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ తో పాటు.. పొంగులేటి కుటుంబ సభ్యులు మైనింగ్ కు సంబంధించి బోలెడన్ని ఆరోపణల్ని సంధించారు మాజీ మంత్రి హరీశ్. ఇక్కడే దిద్దుకోలేని తప్పు చేశారు హరీశ్. ఒక వేలి ఎత్తు చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మనల్ని ప్రశ్నిస్తాయన్న చిన్న లాజిక్ ను హరీశ్ మిస్ అయిన పరిస్థితి. ఇదే విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రంగంలోకి దిగటమే కాదు.. హరీశ్ వాదనకు కౌంటర్ అటాక్ మొదలు పెట్టటమేకాదు.. సభలో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ మంత్రులకు ఊరట కలిగించటమే కాదు.. ఎవరైతే తమ మీద దాడికి దిగారో సదరు హరీశ్ మీద మాత్రమే కాదు.. గులాబీపార్టీకి చెందిన పలువురు పెద్ద తలకాయలు సైతం తల పట్టుకునేలా చేశారు సీఎం రేవంత్.

పొంగులేటీ వ్యూహం.. గురి తప్పింది
మంత్రి పొంగులేటి మైనింగ్ మీద విమర్శలు..ఆరోపణలు చేసిన మాజీమంత్రి హరీశ్ నోటి వెంట మాట రాకుండా చేయటమే కాదు.. చివరకు వాకౌట్ చేసే వరకు వెళ్లిన పరిస్థితికి కారణం..బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలకు సంబంధించి మైనింగ్ వ్యాపారాల చిట్టా విప్పిన సీఎం తీరుతో విషయం మొత్తం మారిపోయింది.
ఇంతకూ సీఎం రేవంత్ చెప్పిన బీఆర్ఎస్ నేతల మైనింగ్ అంశాల్ని చూస్తే..

జోగినిపల్లి సంతోష్ రావు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మైనింగ్ కు సంబంధించి సంతోష్ రావు..ఆయన తండ్రి రవీందర్ రావు
గంగుల కమలాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శిరీష జియో గ్రానైన్స్, శ్వేత గ్రానైట్ సంస్థల ద్వారా జరిగిన అక్రమాల సంగతేంటి?
వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్ వ్యవహారం
హరీశ్ సోదరుడు హరీశ్ రావు సోదరుడికి చెందిన మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీలోని అక్రమాలు. కేటీఆర్ – హరీశ్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఐదేళ్లు చొప్పున మైనింగ్ శాఖను నిర్వహించిన కేటీఆర్, హరీశ్ రావులేన మొత్త అక్రమాలకు బాధ్యులు. నెలకు రూ.వెయ్యి కోట్ల మేర అక్రమ సంపాదన జరిగింది. అంటూ సీఎం ఎదురుదాడి కొనసాగింది.
జోగినిపల్లి రవీందర్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు కు చెందిన మైనింగ్ అంశాలు
గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెర్వు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలకు చెందిన మైనింగ్ కార్యకలాపాలు

తుపాకీ రివర్స్
కేసీఆర్ నేరుగా మైనింగ్ అక్రమాలకు పాల్పడలేదనీ.. ఆయన ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా?మరి కేసీఆర్ బాధ్యత వహించాలి కదా? అంటూ సీఎం ప్రశ్నించారు. దీనికి అనూహ్యంగా బీఆర్ఎస్ అక్కడ తప్పించుకోలేని పరిస్థితుల్లో పడింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు అగ్రనేతలు.. వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇసుక దందా, మైనింగ్ అక్రమాల మాటేంటి? అంటూ సీఎం పలు పేర్లు చదివారు.
అందుకే 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని మైనింగ్ లీజులు.. అక్రమాలపై సీబీ సీఐడీ విచారణకు జరిపి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక సమర్పిస్తామని సీఎం ప్రకటించారు. మంత్రి పొంగులేటి మైనింగ్ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఇరుకున పెడుతుందని భావించిన బీఆర్ఎస్ నేతలు.. చివరకు తమ వద్దకు వచ్చి ఆగటమే కాదు.. అనూహ్య రీతిలో సీబీసీఐడీ విచారణను ఎదుర్కొనాల్సి రావటంతో ఉలిక్కిపడ్డారు. అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రదర్శించిన దూకుడు బీఆర్ఎస్ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా తమ పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేతలు లోగుట్టుగా తమ వేదనను వ్యక్తం చేయటం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.