Take a fresh look at your lifestyle.

దుబాయ్‌లో ఘనంగా బోనాల మహోత్సవం.. ముఖ్య అతిథిగా కొత్త జైపాల్ రెడ్డి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జూలై 19, 2026న యూఏఈలోని రాస్ అల్ ఖైమా – మైత్రి ఫార్మ్స్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా తదితర ఎమిరేట్స్ నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. విదేశీ నేలపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ బోనాల వేడుకను ETCA వరుసగా నాలుగో ఏడాది నిర్వహించడం విశేషం.

కార్యక్రమం గౌరమ్మ పూజతో ప్రారంభమై, శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, దీపప్రజ్వలనం, బోనాల సమర్పణ, కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన, మహాహారతులతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మహిళలు సంప్రదాయ పట్టు చీరలు ధరించి రంగురంగుల పూలతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళారూపాలు ఎడారి నేలపై తెలంగాణ పల్లె వాతావరణాన్ని సృష్టించాయి.

ముఖ్య అతిథిగా కొత్త జైపాల్ రెడ్డి

ఈ కార్యక్రమానికి మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీ కొత్త జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ETCA సభ్యులను అభినందించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సేవా కార్యక్రమాలతో పాటు బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న తీరు ప్రశంసనీయమని ఆయన అన్నారు. విదేశీ నేలపై తెలంగాణ ఆత్మను సజీవంగా నిలుపుతున్న సంస్థగా ETCA చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ETCA లక్ష్యం – భావితరాలకు తెలంగాణ సంస్కృతి పరిచయం

ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ.. యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులకు, ముఖ్యంగా విదేశాల్లో జన్మించిన పిల్లలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల గొప్పతనాన్ని పరిచయం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఏడాది మరింత వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన LSPMK గ్రూప్ చైర్మన్ రాధారపు సత్యం, ఫోటోగ్రఫీ, వీడియో సేవలు అందించిన లెమన్ స్టూడియో రమేశ్, విరాళాలు అందించిన సభ్యులు, వాలంటీర్లు, కళాకారులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నిర్వహించిన దీపోత్సవం, సామూహిక హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరికీ మహాప్రసాదం పంపిణీ చేసి, సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

విదేశాల్లో ఉన్నామనే భావన కలగకుండా స్వగ్రామంలో బోనాలు జరుపుకున్న అనుభూతి కలిగిందని తెలంగాణ ప్రవాసులు నిర్వాహకులను అభినందించారు. భక్తి, భాష, సంస్కృతి, సంప్రదాయం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ బోనాల మహోత్సవం యూఏఈ తెలంగాణ ప్రవాస సమాజానికి చిరస్మరణీయమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.