యాదాద్రి భువనగిరిలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా.. ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రశాంతంగా పని చేసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించడంతో కార్మికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. మృతి చెందిన వ్యక్తి జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్యగా గుర్తించారు.
రియాక్టర్ దగ్గరలో కార్మికులు:
పేలుడు జరిగిన సమయంలో రియాక్టర్ దగ్గరలో కార్మికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. పేలుడు జరిగిన వెంటనే సైరన్ మోగిస్తూ మిగతా కార్మికులను అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన కార్మికులను ఫ్యాక్టరీ బయటకు తరలించినట్లు తెలిపారు. రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాష్‌ను భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమం ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొంతమంది కార్మికులను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.