Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహణకు సహకరించాలి -ఎన్నికల పరిశీలకుడు రవి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:: ఎన్నికల నిబంధనల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా, సామరస్యంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు జి. రవి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బరిలో పాల్గొంటున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, ప్రచార సరళి, వివిధ అనుమతులు, ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేస్తున్న వివరాల సమర్పణ తదితర అంశాలపై చేపడుతున్న అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు జి.రవి పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగారని, ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా ఎన్నికల నిర్వహించుకునేలా అందరి సహకారం అవసరం అన్నారు‌. అభ్యర్థులు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు అదేవిధంగా మైకుల వినియోగానికి కూడా ముందస్తుగానే అనుమతులు పొందాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. ప్రార్థన స్థలాల్లో ప్రచారం చేయకూడదని, వ్యక్తిత్వాన్ని అవమానపరిచే విధంగా ప్రచారాలు నిర్వహించకూడదని ఆయన అభ్యర్థులకు సూచించారు. రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్రంగా పోటీచేసే అభ్యర్థులకు కూడా అన్ని నిబంధనలను వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ఓటర్లందరికి బూతు స్థాయి అధికారుల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్లే క్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 17 గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒక కార్డును పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేలా అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు తెలియజేయాలని ఆయన తెలిపారు. పోలింగ్ కు 48 గంటల ముందుగానే ప్రచారాలు పూర్తి చేసుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలు పూర్తి అయిన 45 రోజుల లోపు ఎన్నికల్లో ఖర్చు చేసిన పూర్తి వివరాలను సమర్పించాలని లేనిపక్షంలో గెలిచిన అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయడం జరుగుతుందనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.