ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. కొండగట్టు ఆలయ పరిసరాల్లో నిర్వహించనున్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో 64 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్ప్ సెంటర్, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు 6 ప్రదేశాల్లో ఏర్పాటు, ప్రత్యేక స్థలాల్లో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక టెంట్ ల ఏర్పాటు, మెట్ల దారి మార్గంలో లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీక్ష విరమణ, ప్రసాదాల కౌంటర్ ల వద్ద, క్యూ లైన్ల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పార్కింగ్ సదుపాయాలు సరిపడా ఉండేలా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు తాగునీరు (చలి వేంద్రాలు), మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొండ పైన వైద్య సిబ్బందిని నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని, వడదెబ్బ నివారణకు గాను ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతూ, 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించామని తెలిపారు. జయంతి ఉత్సవ రోజుల్లో ఇలాంటి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
కోనేరు యందు ఎప్పటికప్పుడు నీరు నింపుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు, దీక్ష స్వాముల సౌకర్యార్థం వేములవాడ, జగిత్యాల, కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నట్లు తెలిపారు.
దేవస్థానం పరిధిలో, గుట్ట కింద గల వీధులలో పారిశుధ్య సిబ్బందిని అవసరం మేరకు కేటాయించి నిరంతరం శానిటేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఆయా విధులు కేటాయించిన అధికారులకు వసతులు కల్పించిన చోటే బస చేసి అప్పగించిన విధులను భాద్యతగా నిర్వర్తించి జయంతి ఉత్సవాలు ఘనంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిపివో మదన్ మోహన్, ఆలయ ఏవో అంజనా రెడ్డి, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.