ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పట్టణం లోని 12వ వార్డులో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు అనేది డాక్టర్ అంబేద్కర్ కల్పించిన ఒక వజ్రాయుధం లాంటిది. ధనిక, బీద, కుల, మత తారతమ్యం లేకుండా ఎటువంటి వారినైనా పదవి నుండి దించగల సత్తా ఓటు హక్కుకు కల్పించిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. మున్సిపల్ పరిధిలో ని అన్ని వార్డుల్లో కూడా మంచి ప్రజా ధారణ పొందిన వారినే కాంగ్రెస్ బరిలో నిలపడం జరిగిందని, ప్రతి వార్డులో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం తో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నీరజ, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.