Take a fresh look at your lifestyle.

అవును.. కలుసుకున్నాం … నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలతో భేటీ

  • అందరం కలిసి మాట్లాడుకుంటే తప్పేంటీ..?
  • నేను ఏ ఫైల్‌ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు
  • అది ఏ ఫైలో ఎంపీ మల్లు రవి చెప్పాలి
  • అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉంది
  • త్వరలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని కలుస్తా
  • జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేల రహస్య సమావేశం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్​ పార్టీకి చెందిన పదకొండు ఎమ్మెల్యేలు ఎవరికీ తెలియకుండా ఇటీవల భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆదివారం ఓ మీడియాతో మాట్లాడిన అనిరుధ్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు పదకొండు ఎమ్మెల్యేలు సమావేశం అయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే తాము రహస్యంగా సమావేశం కాలేదని వివరణ ఇచ్చారు.నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఒకచోట కలిసి మాట్లాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రచారం జరుగుతున్నట్టు తాను ఏ ఫైల్‌ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదన్నారు. అసలు అది ఏ ఫైల్ అనేది నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలతో పెద్దలకు వివరిస్తానని చెప్పారు. త్వరలోఏ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షిని కలిసి పలు విషయాలపై మాట్లాడాల్సి ఉందన్నారు. అంతే తప్ప నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.

ఇదిలావుంటే.. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే నిధుల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రగిలిపోతున్నట్టు స్పష్టమవుతున్నదని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం మంత్రులున్న నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి తప్ప .. తమ నియోజకవర్గం రావడం లేదనే ఉద్దేశంతో కొందరు ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఒకరిద్దరు మంత్రులు.. ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయడం లేదని వారు అభిప్రాయపడినట్టు సమాచారం. కనీస స్థాయిలో తమకు గౌరవం లభించడం లేదని వారు మథనపడినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఉలిక్కిపడిన టీపీసీసీ చీఫ్​ మహేశ్‌కుమార్‌ గౌడ్.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఫోన్ చేసి రహస్య భేటీలపై ఆరా తీశారు. తాను పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అనిరుధ్‌‌రెడ్డి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఇదీలావుంటే రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోననే చర్చ హాట్​ టాపిక్​ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.