బడ్జెట్ లో రూ. 7,777 కోట్లు కోరిన ఆర్టీసీ
మహాలక్ష్మి పథకం, ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఖర్చు
680 కొత్త బస్సుల కోసం రూ. 241.61 కోట్లు ఇవ్వాలని వినతి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహాలక్ష్మి పథకం నిర్వహణ కోసం ఆర్టీసీ… రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. మహాలక్ష్మి పథకంతో పాటుగా ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో రూ.7,777 కోట్లు మహాలక్ష్మి పథకానికి రీయింబర్స్‌మెంట్ కింద కేటాయించాలని కోరింది. అలాగే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని విన్నవించింది. వీటి కోసం రూ.241.37 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపింది. ఈ నిధుల్లో బస్టాండ్‌ల నిర్మాణం, కొత్త డిపోలు, రుణాల చెల్లింపుల కోసం రూ.855 కోట్లు అవసరమని నివేదించింది. మౌలిక వసతులకు సంబంధించి రూ.442.61 కోట్లు,.. ఆయా వర్గాలకు బస్‌పాస్‌లకు సంబంధించి రూ.358 కోట్లు కావాలని ప్రతిపాదించింది. రాష్ట్ర రవాణాశాఖ కూడా ప్రతిపాదనల్లో.. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో రూ.7,519 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తామని తెలిపింది.
జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డుల జారీ
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరుతో జూన్ 2వ తేదీ నుంచి జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల కోసం రూ.75 కోట్లు కేటాయించింది. మహిళలు ఉచిత బస్పు ప్రయాణం కోసం ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కాకుండా.. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే.. వీటిని చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా ఆర్టీసీ ప్రతిపాదనల్లో కొత్త బస్సులతో పాటు, బస్టాండ్‌లు, డిపోలు కూడా ఉన్నాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహాలక్ష్మి పథకానికి ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ముఖ్యంగా.బస్సుల్లో రద్దీ తగ్గుతుంది. కొత్త డిపోలు, బస్టాండ్‌లు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆర్టీసీ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొన్నది.