- రాష్ట్రంలో 1,12,15,134 కుటుంబాలు
- అత్యధికంగా 46.25 శాతం మంది బీసీలు
- 17.43 శాతం జనాభాతో ఎస్సీలు
- కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ నివేదిక
- ఈ నెల 4న కేబినెట్ సమావేశం ముందుకు సర్వే రిపోర్ట్
- అదే రోజు ప్రత్యేక అసెంబ్లీలో కులగణనపై చర్చ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కులాలు.. కుటుంబాల లెక్క ఎట్టకేలకు తేలింది. మొత్తం 1,12,15,134 కుటుంబాలు ఉన్నట్లు వెల్లడైంది. 46.25 శాతం జనాభాతో బీసీలు అగ్రస్ధానంలో నిలవగా.. ఎస్సీలు 17.43 శాతం జనాభాతో రెండో స్ధానంలో నిలిచారు. ఓసీలు 15.79 శాతం, ముస్లిం మైనార్టీలు 12.56, ఎస్టీలు 10.45శాతం జనాభా కలిగిఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రజా ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలను అధ్యయనం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ కులగణన సర్వే నివేదిక ను ప్లానింగ్ కమిషన్ అధికారులు ఆదివారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అందజేశారు. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని కులాల వారీగా ప్రజల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం సేకరించింది.
ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితితో పాటు.. ఆర్థిక,విద్య,ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకున్నది. వీటితో పాటు రాజకీయపరంగా ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉంది.. ఎవరికి ఎంత ప్రాధన్యత ఇవ్వాల్సి ఉంది..అన్న అంశంపైనా స్పష్టతకు వచ్చింది. ఈ క్రమంలో రాజకీయాల్లోనూ కుల ప్రాతినిధ్యంపై దృష్టిసారించిన కాంగ్రెస్ సర్కార్ కులగణనలో తేలిన లెక్కల ప్రకారం కులాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నది. తాజాగా సర్వే తో తేలిన అంశాలు, వివరాల ప్రకారం.. ఏయే సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సి ఉంటుంది.. ఎవరికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది అనేది స్పష్టత వస్తుందని ఇది వరకే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రకారం ముందుకు వెళతామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు.. కులగణనలో తేలిన అంశాలతో.. ప్రస్తుతం అమలవుతన్న సంక్షేమ ఫలాలు ఏ కులాలకు చెందిన ఎంత మందికి అందుతున్నాయి.. వెనకబడిన కులస్తుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేసే కొత్త పథకాల విషయంలోనూ.. ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న సమాచారం లభించనుంది. దీంతో అన్యాయం జరిగిన వర్గాలకు కూడా న్యాయం చేకూరే అవకాశం ఉంది.
తుది అంకానికి బీసీ రిజర్వేషన్లు
కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని చివరి అంకానికి చేరింది. రేపు ఉదయం ప్రత్యేక భేటీ కానున్న రాష్ట్ర కేబినెట్ కులగణన నివేదికపై చర్చించనుంది. అదేరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అందులో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీకి కులగణణ నివేదిక అందింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్‌రెడ్డి సర్కార్ యోచిస్తుంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపే అవకాశం ఉంది.
కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు
01. రాష్ట్రంలోని వివరాలు అందించినవారు 3,54,77,554 మంది.
02. మొత్తం వివరాలు అందించిన కుటుంబాల సంఖ్య 1,12,15,134
03. కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం
04. సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం
05. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,84,319 (17.43శాతం),
06. ఎస్టీలు 37,05,929 (10.45శాతం)
07. రాష్ట్రంలో బీసీలు 1,64,09,179 (46.25శాతం),
08. మొత్తం ముస్లిం జనాభా 44,57,012 (12.56శాతం)
09. ఇందులో ఓసీ ముస్లింలు 35,76,588 (10.08శాతం), బీసీ ముస్లింలు 8,80,424 (2.48శాతం)
10. ఓసీల జనాభా 15.79శాతం