Take a fresh look at your lifestyle.

పురపాలక కౌంటింగ్ ముగిసింది: నిర్మల్ కాంగ్రెస్ కైవసం, ఖానాపూర్‌లో హంగ్, భైంసాలో ఇండిపెండెంట్లు కీలకం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

ఈ నెల 11న ముగిసిన ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా మున్సిపల్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజానీకం శుక్రవారం ఫలితాలు వెలువడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాల అనంతరం నిర్మల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఖానాపూర్ లో హంగ్ ఏర్పడింది. భైంసా పీఠాన్ని ఎం ఐ ఎం కైవసం చేసుకునేందుకు 2 సీట్లు తక్కువ కావటంతో ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. శుక్రవారం ఉదయమే కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లను తరలించారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఇందులో బీజేపీ కి 53, కాంగ్రెస్ కు 52, బి ఆర్ ఎస్ కు 7, ఎం ఐ ఎం కు 10 ఓట్లు వచ్చాయి. నిర్మల్ లో తొలి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది. కాగా భైంసా లో ఎంఐఎం, ఇండిపెండెంట్ల మధ్యే పోటీ కొనసాగింది. కాగా ఫలితాలు ఆసక్తికరంగా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత శ్రీహరి రావు నివాసం ఉంటున్న వార్డులో అదే పార్టీ అభ్యర్థి అడపా శ్రీకాంత్, బీజేపీ అభ్యర్థి ఖమ్మం సురేందర్ చేతిలో ఓటమి చవి చూసారు. కాగా బీజేపీ ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి వార్డులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి ఓటమి పాలయ్యారు. అలాగే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ఉంటున్న వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎలుగు సుధాకర్ పై బీజేపీ అభ్యర్థి వినిషా లక్ష్మీ గెలుపొందారు. బీజేపీ నుంచి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన అయ్యన్నగారి రాజేందర్ దంపతులు ఓడిపోయారు. బీజేపీ నేతలు రావుల రాంనాథ్ కూతురు రమ్య 13వ వార్డు నుంచి గెలుపొందారు. మరో బీజేపీ నేత సాదం అరవింద్ సతీమణి స్వప్న గెలుపొందారు. సీనియర్ నేత ఒడిసెల శ్రీనివాస్ సతీమణి, ఒడిసెల అర్జున్ తల్లి లక్ష్మీ విజయం సాధించారు. బీజేపీ నేతలు అలివేలు మంగ, మెడిసిమ్మె రాజు కుటుంబ సభ్యులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పక్షాన బరిలో ఉన్న అప్పాల గణేష్ చక్రవర్తి, ఆయన సతీమణి కావ్య గెలుపొందారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నాందేడపు చిన్ను కుటుంబ సభ్యులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పక్షాన తౌహుద్దీన్ రఫ్ఫు, ఆయన సతీమణి ఆయేషా కౌసర్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 14, ఎం ఐ ఎం 2, కాంగ్రెస్ 25, బి ఆర్ ఎస్ 1 చొప్పున గెలుపొందాయి. గతంలో కేవలం ఒక స్థానం కైవసం చేసుకున్న బీజేపీ ఈ సారి 14 సీట్లకు ఎదగటం ఆ పార్టీ కి ఉన్న ఆదరణకు నిదర్శనం గా భావిస్తున్నారు.

 

ఖానాపూర్
ఖానాపూర్ లో ఫలితాలు హంగ్ కు దారి తీసాయి. తొలి ఫలితాల్లో బీజేపీ, బి ఆర్ ఎస్ చెరో 4 స్థానాలు, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానం కైవసం చేసుకున్నారు. ఐతే ఇండిపెండెంట్ అభ్యర్థి సైదా బేగం ఎంఎల్ఏ వెడ్మా బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో మూడు ప్రధాన పార్టీలు చెరి 4 స్థానాలు కైవసం చేసుకున్నట్లయింది. దీంతో అధ్యక్ష పీఠం ఏ పార్టీని వరించనుందోనని ఆసక్తిగా చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.