- మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్దమని చెబుతోన్నా మారణహోమం సరైంది కాదు.
- ఈ విషయంలో కేంద్రం తక్షణ నిర్ణయం తీసుకోవాలి.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో కేంద్ర సాయుధ బలగాలు చేపడుతున్న కూంబింగ్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్దమని పదేపదే ప్రతిపాదిస్తున్నప్పటికీ కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని తెలిపారు.ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కర్రెగుట్ట అడవులలో కూంబింగ్ నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణహోమం చేయడం సరైన చర్య కాదన్నారు. అణచివేత ఒక్కటే మార్గం కాదని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు.తాము శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు.ఇప్పటికే మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమైనట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు, పదుల సంఖ్యలో సాయుధ బలగాలు వడదెబ్బకు గురైనట్లు సమాచారం తమకు అందిందన్నారు.వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని వెంటనే కూంబింగ్ నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.