సింగిల్ బెంచ్ స్టేను కొట్టివేసిన డివిజన్ బెంచ్
టీజీపీఎస్సీ నిర్వహించిన నియామకాలు సక్రమమేనని స్పష్టీకరణ
పరీక్షల నిర్వహణ, ఉద్యోగస్తుల ఎంపికలో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని వ్యాఖ్య
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలపై గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరటనిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 నియామకాలపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 నియామకాలు సక్రమమేనని తేల్చి చెప్పింది. పరీక్ష పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు నిర్వహణ, ఉద్యోగస్తుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో 562 మంది గ్రూప్-1 అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే వీరందరూ శిక్షణ, ఉద్యోగ బాధ్యతల్లో చేరేందుకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గతేడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎంపిక కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గతంలోనే విచారణ జరిపిన సింగిల్ హైకోర్టు బెంచ్ ధర్మాసనం గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ అప్పట్లో సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా.. గ్రూప్స్ రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ ఆ నియామకాలపై స్టే విధించింది. దీంతో అప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను కూడా అందజేసింది. ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసింది. తాజా తీర్పుతో గ్రూప్ 1 అర్హత సాధించిన ఉద్యోగులకు ఊరట లభించింది.