Take a fresh look at your lifestyle.

యూరియా కోసం రైతుల ఆందోళన…….

 

తిప్పర్తిలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

ముద్ర, తిప్పర్తి :

యూరియా కోసం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల రైతులు ఆందోళనకు దిగారు. సాగుకు కీలకమైన యూరియా సకాలంలో అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మండల కేంద్రంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా పంపిణీ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డ రైతులు… తమకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆరోపించారు. వరి నాట్లు వేసిన సమయంలో యూరియా వేయడం అత్యవసరమని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లో గంటల తరబడి ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని, ఉన్నతాధికారులు స్పందించి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల మెరుపు ఆందోళనతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై సుమారు 3 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. యూరియా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే పంపిణీ జరిగేలా చూస్తామని పోలీసులు స్థానిక అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అన్నదాతలు ఆందోళనను విరమించి రహదారిపై నుంచి పక్కకు తప్పుకోగా.. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Leave A Reply

Your email address will not be published.