ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేన్నట్లుగా కేవలం 9 రోజుల్లోనే.. 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసాను ప్రజా ప్రభుత్వం రైతులకు అందించింది అని చెప్పారు. అందులో మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంట్, సబ్సిడీ గ్యాస్ సిలండర్, పేదలకు సన్నబియ్యం వంటి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.వీటితో పాటుగా ఎవరూ ఊహిచనంత పెద్ద స్థాయిలో రైతు భరోసాను ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అమలు చేస్తోందని చెప్పారు. అందులో భాగంగా ఈ సీజన్ మొదలు కాగానే ఎకరాకు గతంలో రూ. 10 వేలుంటే మనం రెండువేలు జోడించి రూ.12 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతోందన్నారు. గతంలో 5,10 ఎకరాలకు మాత్రమే అని పరిమితులు ఉండేదన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేమీ లేకుండా వ్యవసాయం యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతోందన్నారు. రైతు భరోసా వేయడం మొదలు పెట్టి కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగిందన్నారు.ఇంత తక్కువ కాలంలో రైతు భరోసాను పూర్తిగా వేయడం రాష్ట్ర చరిత్రలోనే ఇద తొలిసారన్నారు.ఈ నెల 16న మొదలు పెట్టి దీనిని మంగళవారం నాటితో పూర్తి చేయడం జరుగుతోందన్నారు.అందుకే రాష్ట్రంలోని రైతు వేదికల వద్ద రైతులను సమావేశ పరుస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సచివాలం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని కోరుతున్నా అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.