ముద్ర ప్రతినిధి, నిర్మల్:
యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఉందన్న పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ నిర్మల్ జిల్లాలో అన్నింటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అపోహలేనని స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా ప్రజలు బంకుల వద్దకు చేరుకోవడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా కొనసాగుతోందని, పెట్రోల్ బంకుల అసోసియేషన్ ప్రతినిధులు కూడా తమ వద్ద తగిన నిల్వలు ఉన్నట్లు ధృవీకరించినట్లు తెలిపారు.
ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణం
జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరఫరా ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
పరిస్థితిని దగ్గరగా గమనించేందుకు అదనపు కలెక్టర్లు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు.
పానిక్ బయింగ్ చేయవద్దు
సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు అనవసర కొనుగోళ్లకు పాల్పడవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలకు అవసరమైన ఇంధన వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.