ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సారంగాపూర్ మండలంలోని కౌట్ల, సారంగాపూర్, జామ్ గ్రామాలతో పాటు నిర్మల్ మార్కెట్ యాడ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో నిల్వ ఉన్న పంట ఉత్పత్తులను పరిశీలించి, అక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సక్రమంగా జరిగేలా చూడాలని, సేకరించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు త్వరగా జరిగేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నాయకులు ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు రాజు, నరేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.