Take a fresh look at your lifestyle.

ఆస్తులను రక్షించేందుకే హైడ్రా!

  • దేశంలో మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించే పరిస్థితి లేదు.
  • ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దు.
  • బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వచ్చిన ఉపద్రవం మనకు రావద్దు.
  • చెరువులు కనుమరుగైతే మనుగడ ఉండదు.
  • మూసీని ప్రక్షాళన చేస్తామంటూ బీజేపీ అడ్డుపడుతుంది.
  • వాళ్ళు గంగా, యమునా నదిని ప్రక్షాళన చేయలేదా?
  • యోగి చేస్తే ఒప్పు, మేం చేస్తా తప్పా?
  • హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
  • హైడ్రా వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం.

ముద్ర, తెలంగాణ బ్యూరో :కాలుష్య నియంత్రణ లేక మెట్రో నగరాలు నివాసయోగ్యం కాని నగరాలుగా మారుతోన్న వేళ హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి ఎదురవకూడదనే లక్ష్యంతో ఎవరేమనుకున్న సరే హైడ్రాను తీసుకొచ్చమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయన్నారు. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారన్నారు.ఇప్పుడు నగరాన్ని పునరుద్ధరించుకోవాలని దృక్పథంతో హైడ్రాను ముందుకు తీసుకొచ్చామన్నారు.ఈ మేరకు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 55 స్కార్పియోలు, 4 ఇన్నోవా క్రిస్టాలు, 5 మినీ బస్సులు, 37 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బెంగుళూరులో చెరువులను పరిరక్షించక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమవుతున్న పరిస్థితులు చూస్తున్నామని అన్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశ్యంతో హైడ్రాను రంగంలోకి దింపామన్నారు. ప్రకృతిని కాపాడుకోలేకపోతే హైదరాబాద్‌లోను విపత్కర పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుందన్నారు.హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదని, ప్రజల ఆస్తులను కూడా రక్షించేదని అన్నారు. రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని, కొందరు రోడ్లను ఆక్రమించుకుని ఇండ్లను నిర్మాణం చేపట్టారన్నారు. వీటిని నియంత్రించాల్సి అవసరం ఉందన్నారు. హైడ్రా ద్వారా చెరువులను కాపాడి, వాటిని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.చెరువులను, నాలాలను, మూసీని ఆక్రమించుకున్నవారికే హైడ్రా అంటే కోపం ఉందని ఆయన చెప్పారు. అలాంటి కొంతమంది తమ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా సరే ప్రజల కోసం తాము వెనక్కి తగ్గబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నగరాన్ని పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధ కలగుతుందని, ప్రకృతిని కాపాడుతామంటే మరికొందరికి కోపం వస్తుందన్నారు.ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.అలాంటివారు కడుపునిండా విషం పెట్టుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.గుజరాత్‌లోని సబర్మతి, ఉత్తర ప్రదేశ్‌లోని గంగానది, ఢిల్లీలోని యమునా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటారు కానీ, తెలంగాణలో మాత్రం మూసీ నది ప్రక్షళనను, పునరుద్దరిస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటారని ఆయన దుయ్యబట్టారు.బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్పా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏమైనా కక్ష ఉంటే తనపై చూపించాలని, కానీ ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దని బీజేపీ నేతలకు సీఎం విజ్ఞప్తి చేశారు.వారసత్వ సంపదను కాపాడుతూ..హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించుకుందామని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.పేదల పట్ల మానవీయ కోణంలో సానుభూతితో వ్యవహరించాలని, అక్రమణలకు పాల్పడిన పెద్దల పట్ల కఠినంగా ఉండాలని హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.