- శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు శ్రీకారం.
- భూపరిశీలన చేసిన కలెక్టర్.
మంథని, ముద్ర విలేకరి: మంథని ప్రాంతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూములను కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అంగులురు శివారులో ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు, శ్రీపాద మార్గ్ పేరున బైపాస్ రోడ్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం అనుకూలంగా ఉన్న భూమిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 70 ఎకరాలు సేకరణ కోసం ఎంజాయ్మెంట్ సర్వే ప్రారంభించాలని, పరిశ్రమల జోనల్ మేనేజర్ నుంచి మినహాయింపు తెచ్చుకోవాలని సూచించారు. శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అనువైన భూమి రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే మార్కింగ్ చేయాలని, ఆర్&బీ మార్కింగ్ ప్రకారం రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బైపాస్ రోడ్ నిర్మాణానికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు 10ఏ మినహాయింపు సాధించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పనులను ప్రణాళిక బద్ధంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.